Sunday, July 13, 2025
E-PAPER
Homeఅంతరంగంనవ్వితే పోలా..!

నవ్వితే పోలా..!

- Advertisement -

హాయిగా నవ్వడంలో ఉన్న ఆనందం వెల కట్టలేనిది. ముఖానికి ఒక పెట్టని ఆభరణం నవ్వు. ఎన్నో అనారోగ్య సమస్యలకు నవ్వు ఓ ఔషధం. నవ్వుతో ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అందుకే ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ’ అని ఓ కవి ఎప్పుడో చెప్పాడు. అదే కవి నవ్వుతూ చావాలనీ అన్నాడు. కానీ, నవ్వుతూ ఉంటే ఆ చావు అంత తొందరగా రాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఈరోజుల్లో చాలా మంది హాయిగా నవ్వడమే మరిచిపోతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో బిజీబిజీగా బతికేస్తున్నాం. డబ్బు సంపాదన తప్ప మనసుకు హాయినిచ్చే పనులే చేయలేకపోతున్నాం.
ఇంట్లో, బయట, ఆపీస్‌ ప్రతీ ఒక్క విషయంలోనూ టెన్షన్‌. కొందరైతే నవ్వడం అంటే ఏదో తప్పు చేసినట్టు భావిస్తున్నారు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తే అదే హూందాతనం అనుకుంటారు. కానీ చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుందనే విషయమే తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు నవ్వు విషయంలో పిసినారితనం అస్సలు పనికిరాదని గుర్తుపెట్టుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నవ్వుతూ ఉన్నవారే ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారని, పైకి ఎదుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఎప్పుడూ చిరునవ్వులు చిందించే వ్యక్తులు ఎదురుపడితే ఆ రోజు మన మనసుకు ఎంత హాయిగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకోండి. నవ్వులో అందమే కాదు ఆరోగ్యమూ ఉందని గుర్తుపెట్టుకోండి. అందువల్ల నవ్వుతూ ఉండేవాళ్ల జీవిత కాలం నవ్వడమే మర్చిపోయిన వాళ్లకంటే కొన్నేండ్లపాటు అధికంగానే ఉంటుందని ఎన్నో రీసెర్చ్‌లు తేల్చాయి. ఆయుష్షు పెరగడం ఒకటే కాదు దరహాసంతో మరెన్నో లాభాలున్నాయి. నవ్వుతూ ఉంటే మనలోని ఒత్తిడి తగ్గుతుంది. మోముపై నవ్వులు విరబూసినప్పుడు మెదడులో సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్‌, సెరటోనిన్‌ హార్మోన్లు విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. నవ్వు రక్తపోటుని తగ్గిస్తుందని అనేక రుజువులున్నాయి.
గుండెల్లో గుబులు పుడితే కుంగుబాటుకు గురవుతాం. పోషకాల లోపమే కాదు నవ్వులేకపోయినా రోగాలొస్తాయి. మనోవ్యాకులత వల్ల శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కారణం వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం. ఆ రోగాలను గెలవాలంటే నవ్వాల్సిందే! ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిందే! అంతేకాదు నొప్పులను కూడా నవ్వు తగ్గిస్తుంది. నవ్వేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్‌, సెరటోనిన్‌లు నొప్పులు తగ్గించే సహజ ఔషధాలు. అంతేకాదు నవ్వుతూ ఉంటే నలుగురిని ఆకర్షిస్తూ ఉంటారు. నవ్వితే ఇన్ని లాభాలున్నాయి కాబట్టే నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం, నవ్వలేకపోవడం ఓ రోగం అన్నాడు జంధ్యాల.
మన సమస్యల్ని ఎదుర్కొనేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు నవ్వు ఓ ఆయుధం. భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకోలేని సమయంలో బిగ్గరగా నవ్వడం, కామెడీ వీడియోలు చూడడం వల్ల ప్రతికూల ఆలోచనలు దూరమై అనుకూల ఆలోచనలు చేరవవుతాయి. నవ్వు నాలుగు విధాల చేటు అన్నది పాత సామెత. నవ్వు నలభై విధాల గ్రేట్‌ అని నేటి మనోవైజ్ఞానిక పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి నవ్వండి. నవ్వుతూ ఉండండి. మీ చుట్టూ ఉన్న వారిని నవ్వించండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -