నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు.వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని చెప్పారు.
ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.



