నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్తిపాస్తులను సాధారణంగా పిల్లలకు లేదా దగ్గరి బంధువులకు రాసిస్తుంటారు. కానీ చైనాకు చెందిన ఓ వృద్ధుడు వినూత్న నిర్ణయం తీసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. తన తర్వాత తన పెంపుడు పిల్లిని జాగ్రత్తగా చూసుకునే వారికి తన పూర్తి ఆస్తిని ఇస్తానని ప్రకటించాడు. ఈ సంఘటన జంతుప్రేమకు కొత్త నిర్వచనం చెబుతోంది.
దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో నివసించే 82 ఏళ్ల లాంగ్ అనే వృద్ధుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఆయన భార్య చనిపోగా, వారికి పిల్లలు లేరు. ఈ క్రమంలో ఒక రోజు తనకు దొరికిన కొన్ని పిల్లి పిల్లలను చేరదీశాడు. వాటిలో ‘జియాన్బా’ అనే పిల్లి మాత్రమే ప్రస్తుతం ఆయనకు తోడుగా ఉంది. తన తర్వాత జియాన్బా భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందిన లాంగ్, దానికి జీవితాంతం తోడుండే ఒక నమ్మకమైన వ్యక్తి కోసం వెతుకుతున్నాడు.
గ్వాంగ్‌డాంగ్ రేడియో అండ్ టెలివిజన్‌తో మాట్లాడుతూ తన పిల్లిని ప్రేమగా చూసుకునే వారికి తన అపార్ట్‌మెంట్‌తో పాటు బ్యాంకులోని పొదుపు మొత్తాన్ని కూడా ఇస్తానని లాంగ్ స్పష్టం చేశారు. “నా పిల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి, అదొక్కటే నా షరతు” అని ఆయన తెలిపారు.
చైనాలో పెంపుడు జంతువులపై ప్రేమ పెరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది షాంఘైకి చెందిన ఓ వృద్ధురాలు తన పిల్లలు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ సుమారు 2.8 మిలియన్ డాలర్ల ఆస్తిని తన పెంపుడు కుక్కలు, పిల్లులకు రాసిచ్చింది. చైనాలో యువతరం పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తుండటంతో, వాటి సంరక్షణ, ఆహారం, వైద్యం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ పరిణామాలు మారుతున్న సామాజిక సంబంధాలకు అద్దం పడుతున్నాయి.