నవతెలంగాణ-హైదరాబాద్: మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని, దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం ‘దైనిక్ జాగరణ్’ మాజీ ఎడిటర్ నరేంద్ర మోహన్ స్మారకోపన్యాసంలో షా ప్రసంగించారు.
కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా సరిహద్దులు ఉన్నాయని, మరి అక్కడ నుంచి చొరబాట్లు ఎందుకు జరగడం లేదని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. చొరబాట్లను అడ్డుకోవడం కేవలం కేంద్ర ప్రభుత్వం, సరిహద్దు భద్రతా దళాల బాధ్యత మాత్రమే కాదని అన్నారు.