నవతెలంగాణ-హైదరాబాద్ : తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు తక్షణమే బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మొత్తం ఆర్థిక సాయంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 2.1 బిలియన్ డాలర్లు పాకిస్థాన్‌కు అందినట్లయింది. ఐఎంఎఫ్ నిర్ణయంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిలియన్ డాలర్ల విడుదలను స్వాగతిస్తూ “భారత్ అనుసరించిన కఠినమైన వ్యూహాలు విఫలమయ్యాయని” వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్, పీటీఐ వంటి వార్తా సంస్థలు నివేదించాయి. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఐఎంఎఫ్, ఈ నిధులను తక్షణమే విడుదల చేయడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది.
మరోవైపు, పాకిస్థాన్‌కు ఈ ఆర్థిక సహాయం అందించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. శుక్రవారం జరిగిన ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో పాకిస్థాన్‌కు రుణాలు మంజూరు చేసే ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఈ నిధులను పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వ ప్రమేయంతోనే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని న్యూఢిల్లీ చాలాకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఐఎంఎఫ్ నిర్ణయం వెలువడిన తరుణంలోనే పాకిస్థాన్ సైన్యం పశ్చిమ భారతదేశంలోని నగరాలు, సైనిక స్థావరాలపై ఆయుధాలు మోసుకెళ్లే డ్రోన్లు, క్షిపణులతో వరుసగా మూడో రాత్రి కూడా దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల గగనతలంలో పాకిస్థానీ డ్రోన్లు కన్పించాయని, శత్రు లక్ష్యాలను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఒక నివాస కాలనీపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. బుధ, గురువారాల్లో కూడా పాక్ డ్రోన్లు, క్షిపణులు భారత్‌పై దాడులు చేశాయి. ఈ పరిణామాలు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయని సూచిస్తున్నాయి.
పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ బిలియన్ డాలర్ల రుణం
- Advertisement -
- Advertisement -