పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) రెండు విడతల్లో 350 కోట్ల డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంట్లో తక్షణమే వందకోట్ల డాలర్లు ఇస్తారు. వాషింగ్టన్ డిసిలో శుక్రవారం నాడు జరిగిన బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మంజూరు ను అడ్డుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిని ఖాతరు చేయకుండా రుణం ఖరారైంది. మనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్క ఇతర డైరెక్టర్లు రాలేదు. ప్రపంచంలో మన పలుకుబడికి ఇది నిదర్శనమా? పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు, పర్యవసానాల్లో పాక్‌ను అష్టదిగ్బంధనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఒకటిగా ఐఎంఎఫ్ నిధులు అందకుండా అడ్డుకుంటామన్న ప్రచారం తెలిసిందే. ఐఎంఎఫ్, దాని పనితీరు గురించి తెలిసిన వారు దేశంలో నెలకొన్న పరిస్థితుల్లోప్రభుత్వం వృధా ప్రయాసకు లోనవుతున్నదని చెబితే ‘మీ సొమ్మేం పోయింది, ఏదో ప్రయత్నం చేస్తున్నారుగా తప్పేముంది’ అనే వారు కొందరైతే మరి కొందరు దేశద్రోహులుగా చూసే తీరు ఉండటంతో ఎవరూ నోరు మెదపలేదని చెప్పవచ్చు. చిత్రం ఏమిటంటే పెద్ద మీడియా విశ్లేషకులు, సంపాదకులు కూడా పాఠకులను తప్పుదారి పట్టించే కథనాలను అల్లారు. సరే నరేంద్రమోడీ అండ్‌కో వచ్చిన ప్రతి అవకాశాన్నీ తమ ప్రతిష్టకు, ఓట్లు దండుకొనేందుకు ఎంతమేరకు ఉపయోగపడుతుందనే కోణంలో చూడటం కొత్తేమీ కాదు. ఇప్పుడూ జనాన్ని మభ్యపెట్టి అదే ప్రయత్నం చేశారు, భంగపడ్డారు. ఒక తర్కం ఎలా ఉందంటే కాల్పుల విరమణ షరతుల్లో భాగంగా వంద కోట్ల డాలర్ల రుణాన్ని పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ ఇచ్చిందా అంటూ ఒక మీడియా వార్తకు శీర్షిక పెట్టారు. భారత్ దాడుల్లో తమ మిలిటరీ ఆస్తులు ధ్వంసమయ్యాయి గనుక తమకు రుణం ఇస్తే కాల్పుల విరమణ పాటిస్తామని పాకిస్తాన్ షరతు పెట్టి ఉండవచ్చని, అదే షరతుతో రుణం ఇచ్చి ఉండవచ్చన్నది ఒక భాష్యం. రుణానికి లంకె పెట్టి పాకిస్తాన్ మీద అమెరికా ఒత్తిడి తెచ్చిందని కూడా సెలవిచ్చారు.
తమకు రుణం ఇవ్వకుండా చూసేందుకు భారత్ ప్రయత్నించినప్పటికీ ఐఎంఎఫ్ అంగీకరించటం పట్ల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతృప్తి వెల్లడించినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఆర్థికశాఖ ఒక ప్రకటన చేస్తూ ఉగ్రవాదానికి ఊతమిస్తున్నందుకు రుణాన్ని బహు మతిగా ఇచ్చారని, ప్రపంచ మానవాళికి ప్రమాదకర సంకేతాన్ని పంపారని, నిధులు ఇచ్చే సంస్థలు, దాతలకు గౌరవాలకు భంగకరమని, ప్రపంచ విలువలను తక్కువగా చూసిందని విమర్శించింది.పాకిస్తాన్‌కు రుణమిస్తే ఆ మొత్తాన్ని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తుందని, గతంలో ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని మన ప్రభుత్వం గట్టి అభ్యంతరాలను వ్యక్తం చేసింది.ఓటింగ్ సందర్భంగా మన నిరసన నమోదు చేసి ఓటింగ్‌ను బహిష్కరించింది.
పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం.దేశ విదేశీ రుణ భారం 2024 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచ బ్యాంకు 48 బిలియన్ డాలర్లు ఇచ్చింది, 2025 మార్చి నెలాఖరుకు ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాలు 6.2బిలియన్ డాలర్లు ఉన్నాయి. అనేక దేశాల నుంచి చేబదులు మాదిరి సాయం పొందు తున్నది. తిరిగి కోలుకొనేం దుకు, నిర్వహణకు అవసరమైన నిధి(ఆర్‌ఎస్‌ఎఫ్) పేరుతో 140 కోట్ల డాలర్లు, మరోఖాతా కింద 210 కోట్ల డాలర్లను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా 2024 సెప్టెంబరు 25న ఐఎంఎఫ్ ఆమోదించింది. మార్చి నెల 25న అధికారుల స్థాయిలో ఐఎంఎఫ్, పాకిస్తాన్ రుణం గురించి ఒప్పందానికి వచ్చాయి. ఏడు వందల కోట్ల డాలర్లను వంతుల వారీగా ఇస్తారు. 2025 మేనెల తొమ్మిదిన వాటి గురించి సమీక్షించి రానున్న 37 నెలల్లో వాటిని విడుదల చేసేందుకు అంగీ కరించింది. మొత్తం 700 కోట్ల డాలర్ల రుణం కావాలని పాకిస్తాన్ కోరింది.గతేడాది ఆగస్టు నాటికి 9.4బిలియన్ డాలర్లు ఉన్న విదేశీమారక ద్రవ్య నిల్వలు ఏప్రిల్ చివరి నాటికి 10.3బి.డాలర్లకు పెరిగాయి, వాటిని జూన్ నాటికి 13.9 బిలియన్లకు పెంచాలన్నది లక్ష్యం.ఆర్‌ఎస్‌ఎఫ్ నిధులతో ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు పునరుద్ధరణ, చార్జీల వసూలుతో సహా నీటిని మరింత పొదుపుగా వాడేందుకు చర్యలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, సమాచార వ్యవస్థల మెరు గుదల వంటి అంశాలు చేపట్టాల్సి ఉంది. సవాళ్ల వాతావరణం ఉన్నప్పటికీ స్థూల అర్థిక స్థిరత్వం పునరుద్ధరణ జరుగు తున్నదని ఐఎంఎఫ్ పేర్కొన్నది. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపుతో సహా అనేక సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది.సకాలంలో విద్యుత్ ఛార్జీల సవరణ ద్వారా రుణభారం తగ్గిందని, పాకిస్తాన్ రిజర్వుబాంకు గట్టి చర్యల కారణంగా రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం తగ్గిందని, వ్యవస్థాగత సంస్కరణలు చేయాలని పేర్కొన్నది. నక్షత్రకుడి మాదిరి జనానికి వ్యతిరేకమైన షరతులతో పాకిస్తాన్ రుణాలు తీసుకున్నది. మనదేశంలో మాదిరి ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టు బడుల నిలిపివేత, మూసివేత, తెగనమ్మటం, వినియోగదారుల నుంచి సేవలకు ఛార్జీలు, విద్యుత్ ఇతర రంగాల్లో సంస్కరణల వంటివి వాటిలో ఉన్నాయి.
ఐఎంఎఫ్ నిబంధనల ప్రకారం ప్రతి దేశానికి ఓటింగ్ సంఖ్య ఉంటుంది. ఆ మేరకు ఇతర సందర్భాలలో ఓటు వేయవచ్చు. రుణాల మంజూరు విషయంలో ఏకాభిప్రాయమేగాని ఓటింగ్ ఉండదు. అంగీకారం లేని దేశం దూరంగా ఉండటం తప్ప వ్యతిరేక ఓటు వేసేందుకు అవకాశం లేదు. తాజాగా మనదేశం అదే చేసింది. ఐఎంఎఫ్‌లో ఓటింగ్ బలాబలాల విషయాన్ని చూద్దాం. అమెరికా 16.49, జపాన్ 6.14, చైనా 6.08. మొత్తం 25 మంది డైరెక్టర్లలో ఈ మూడు దేశాలకు ఒక్కొక్క డైరెక్టర్ నిరంతరం ఉంటారు. మిగిలిన 22 మందిని దేశాలతో కూడిన 22 బృందాలు వంతుల వారీ ఎన్నుకుంటాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్,భూటాన్,శ్రీలంక, భారత్ కలసి ఒక బృందం. ఈ దేశాల నుంచి ఎవరో ఒక మాత్రమే ఉంటారు.వీటన్నింటి ఓటింగ్ బలం 3.05 మాత్రమే. మొత్తం ఓట్లు 49,91,063 కాగా చైనాకు 3,06,281 కాగా మన బృంద దేశాలన్నింటికీ కలిపి ఉన్నది 1,53,610 కాగా మన దేశానికి 1,32,596, బంగ్లాదేశ్ 12,118, శ్రీలంక 7,240, భూటాన్ 1,656 ఉన్నాయి. వేరే గ్రూపులో ఉన్న పాకిస్తాన్‌కు 21,762 ఉన్నాయి. ప్రస్తుతం మన దేశం నుంచి పరమేశ్వరన్ అయ్యర్ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్నారు.
పాక్‌పై గతంలోనే ఒక అంచనాకు వచ్చిన ఐఎంఎఫ్ రుణం ఇవ్వకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ ఇవ్వటం, ఇతర దేశాల మీదకు వదలటం ఇస్లామాబాద్‌కు కొత్త కాదు. తాము శిక్షణ ఇచ్చినట్లు ఆ దేశ మంత్రే స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ రుణాలు, గ్రాంట్లు ఇస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి వాటికి లంకె పెట్టలేదు.ఒక్క పాకిస్తానే కాదు, ఏ దేశానికీ అలాంటి షరతులేదు. అలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఉండి ఉంటే అసలు ఏ దేశానికీ రుణం పొందే అర్హత, అవకాశం ఉండదు. ఏదో ఒక ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణ లేదా విమర్శలకు గురికాని దేశం ఒక్కటంటే ఒక్కటి లేదు. పహల్గాం ఉగ్రదాడితో నిమిత్తం లేకుండానే ముందే చెప్పినట్లు నెల రోజుల ముందే అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి లాంఛన ప్రాయంగా ఆమోద ముద్రవేయటం తప్ప మే తొమ్మిది సమావేశానికి మరొక అజెండా లేదు. ఈ విషయాలన్నీ మన విధాన నిర్ణేతలు, పరిశీలకులకు తెలియవా? తెలిసి కూడా జనంలో ఉన్న మనోభావాలను సొమ్ము చేసుకొనేందుకు, వ్యతిరేకిస్తున్నట్లు నాటకం ఆడారా? ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాదిని ఒంటరిపాటు చేసే క్రమంలో మిగిలిన దేశాలు కలసి వచ్చినపుడు ఒకటి రానపుడు వేరే ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంటుంది. అందుకోసం తెరవెనుక ప్రయత్నాలు చేశారా?
2019లో పుల్వామా దాడికి ప్రతిగా మనం బాలాకోట్‌పై మెరుపుదాడి చేశాము. అప్పటి నుంచి లేదా అంతకు ముందు జరిగిన దాడుల నాటి నుంచి ఐఎంఎఫ్ లేదా ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇస్లామాబాద్‌కు రుణాలు ఇస్తే వాటిని ఉగ్రవాదులకు మళ్లిస్తారని మన దేశం చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీడియాలో అలాంటి ఛాయలు లేవు. అంతర్గతంగా ఒత్తిడి తెచ్చారేమో మనకు తెలియదు కదా అని అమాయకంగా చెప్పేవారు ఉండవచ్చు. ఆ ప్రకారం చూసినా నిజమే అనుకుంటే ఒక్కదేశం కూడా మన మాటకు గౌరవమిచ్చి మనతో పాటు కలసి రాలేదు. మన నిరసన తెలిపేందుకు బహిష్కరించామని ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు. దానికి ముందు అడ్డు కుంటామని, మరేదో చేస్తామనే ప్రచార ఆర్భాటమెందుకు, ఆ మాటలు నమ్మి అనేక మంది నరేంద్రమోడీకి ప్రపంచంలో నిజంగానే అంత పలుకుబడి ఉందనుకున్నారు. ఎందుకంటే కొద్ది రోజులపాటు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని, చైనా, అమెరికాలను మన చుట్టూ తిరిగేట్లు చేశారనే ప్రచారాలు, భజనలూ తెలిసిందే. మన అభిప్రాయాలను ఖాతరు చేయని ఐఎంఎఫ్ నుంచి మన దేశం నిరసనగా తప్పుకుంటుందా? అవమానాన్ని దిగమింగి కొనసాగుతుందా ?ఖ్యాతి అయినా అపఖ్యాతి అయినా నరేంద్రమోడీ ఖాతాలోనే పడతాయి మరి!
– ఎం కోటేశ్వరరావు
8331013288
పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ రుణం: అమెరికా దౌత్యమేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES