పులి సంచారంపై కలెక్టర్‌తో మాట్లాడిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
పెద్ద పులి దాడులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, పులి దాడులను కట్టడి చేసేందుకే తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కోరారు. మంగళవారం యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లితో పాటు పలు మండలాలలో పులి సంచారం, లేగ దూడలపై పెద్ద పులి దాడులను కలెక్టర్ దృష్టికి బీర్ల అయిలయ్య తీసుకెళ్లారు. పులి సంచారంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వెంటనే అటవీ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
పులి దాడులను కట్టడి చేసేందుకు తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ ప్రాంత రైతులు, ప్రజలు, పశువుల రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.



