నవతెలంగాణ-హైదరాబాద్: అధిక పని గంటలు, తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ ముందు ఆన్ లైన్ వేదికగా పని చేస్తున్న గిగ్ వర్కర్ల సమ్మె పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కార్మికుల సమ్మెతో దిగొచ్చిన వివిధ పుడ్ డెలవరీ సంస్థలు వారి డిమాండ్లను అంగీకరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నూతన లేబర్ కోడ్లకు సంబంధించి అభిప్రాయాల సేకరణ కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ముసాయిదా నియమావళిని విడుదల చేసింది. ఇందులో గిగ్ వర్కర్ల అర్హతకు సంబంధించి పలు కీలక నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం గిగ్ వర్కర్లు లేదా ప్లాట్ఫాం వర్కర్లు లబ్ధిపొందాలంటే ఒక అగ్రిగేటర్ కింద గతేడాది కనీసం 90 రోజులు పనిచేసి ఉండాలి. ఒకవేళ బహుళ ఆగ్రిగేటర్ల విషయంలో ఏడాదిలో కనీసం 120 రోజులు పనిచేయాల్సి ఉంటుందని కేంద్రం ప్రతిపాదనలు చేసింది.



