Friday, July 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసముద్రమార్గాన డ్రగ్స్‌ దిగుమతి

సముద్రమార్గాన డ్రగ్స్‌ దిగుమతి

- Advertisement -

దేశవ్యాప్తంగా సరఫరా
హైదరాబాద్‌ నగరంలో పట్టుబడిన డ్రగ్స్‌ ముఠాలు
9 మంది వినియోగదారులు, సరఫరాదారుల అరెస్ట్‌
రూ.69లక్షల డ్రగ్స్‌, గన్‌ స్వాధీనం

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ మాఫియాపై హైదరాబాద్‌ నార్కొటెక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌(హెచ్‌న్యూ) పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. సముద్రమార్గాన డ్రగ్స్‌ దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న ఘరానా ముఠాల గుట్టురట్టు చేశారు. మూడు ముఠాల్లోని డ్రగ్స్‌ విక్రయదారులు, సరఫరా దారుల్లో 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ పెడ్లర్ల వద్ద తొలిసారి పిస్తోల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కొకైన్‌, మెఫిడ్రీన్‌ సరఫరా చేస్తున్న వారున్నారు. రూ.69లక్షల విలువగల 300 గ్రాముల కొకైన్‌, 100 గ్రాముల(ఎండీ) మీయాం మీయాం డ్రగ్స్‌, 12 మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో డీజీ, హైదరాబాద్‌ సీపీ సివి.ఆనంద్‌ డ్రగ్స్‌ ముఠాల వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన రవి కుమార్‌ వర్మ, సచిన్‌ అనే ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకుని వారి నుంచి ముఖ్యమైన సమాచారం సేకరించారు. రవివర్మకు ముంబయికి చెందిన ముఠాతో సంబంధాలున్నాయి. అక్కడ ఉన్న ముజఫర్‌ వాహిద్‌ షేక్‌ అనే వ్యక్తికి విదేశాల నుంచి కొకైన్‌ వస్తోంది. అతడి నుంచి నిందితులు హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసు కొస్తున్నారు. ప్రేమ్‌ ఉపాధ్యారు అనే వినియోగదారుడిని అరెస్టు చేయడంతో ఈ ముఠా గుట్టు బయటపడింది. 2022లో ప్రేమ్‌ ఉపాద్యారు డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబరుకి చెందిన డ్రగ్స్‌ ముఠాలతో ప్రేమ్‌కు సంబంధాలున్నాయని గుర్తించిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. నైజీరియా నుంచి ముజాయిత్‌ డ్రగ్స్‌ను సముద్ర మార్గాన తెప్పించి సబ్‌ సప్లయర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రేమ్‌ ఉపాధ్యారును అరెస్టు చేసి అతని వద్ద నుంచి పెద్దఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో రాజస్థాన్‌కు చెందిన జితేందర్‌ను అరెస్టు చేశారు. కొన్నేండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చిన జితేందర్‌ స్వీట్స్‌ తయారీ చేసే దుకాణాల్లో పనిచేశాడు. ఆ తర్వాత స్విట్‌ షాప్‌ పెట్టాడు. అందులో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. డ్రగ్స్‌ విక్రయిస్తే సులువుగా డబ్బులు సంపాదించొచ్చని ఆలోచించిన జితేందర్‌ రాజస్థాన్‌కు చెందిన సురేందర్‌, హనుమాన్‌తో కలిసి ముఠాగా ఏర్పాడ్డాడు. ఈ ముఠా రూ.75వేలు పెట్టి కంట్రీ మెయిడ్‌ పిస్తోల్‌ను కొనుగోలు చేసింది. అది పని చేస్తుందో లేదో అని కాటేదాన్‌లో ఒక రౌండ్‌ బుల్లెట్‌ ఫైరింగ్‌ చేశారు.
ప్రేమికురాలు మోసం చేసిందని..
తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న కారణంతో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని.. సరఫరాదారునిగా మారిన నిందితున్ని బొల్లారంలో నార్కొటిక్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హర్ష తరచూ గోవాకు వెళ్లేవాడు. అక్కడ క్రిస్‌ అనే డ్రగ్స్‌ పెడ్లర్‌తో పరిచయం అయింది. అతని నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి సేవించాడు. ఆ తర్వాత డ్రగ్స్‌ విక్రయించడం మొదలు పెట్టాడు. పక్కా సమాచారంతో పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ఇదిలావుండగా వీసా గడువు ముగిసినా నగరంలో నివాసముంటున్న ఇద్దరు నైజీరియన్లను డిపోర్టు చేశారు. ఈ సమావేశంలో డీసీపీ వైవీఎస్‌ సుదీంద్ర, ఇన్‌స్పెక్టర్లు బాలస్వామీ, డ్యానియేల్‌, సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -