నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వస్తాయని.. 18న ప్రభుత్వం ఏర్పడుతుందని.. అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ప్రధాని మోడీ గమనించాలన్నారు. నేరం జరగకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదన్నారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో మార్పు వస్తుందని చెప్పారు. కులమతాలతో సంబంధాలు లేకుండా ఈనెల 26 నుంచి నేరస్థులందరినీ జైలుకు పంపిస్తామని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.
బీహార్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 6 (గురువారం), రెండో విడత పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.



