నవతెలంగాణ-హైదరాబాద్: వివిధ దేశాల నుంచి వచ్చే శరణార్థులందరికీ భారతదేశం ధర్మశాల కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో విషయంలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్‌పై వాదనల సందర్భంగా ‘భారతదేశం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వగలదా? మేము 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాం. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయపడ్డారు.
2018లో ఉపా సెక్షన్ 10 కింద ట్రయల్ కోర్టు పిటిషనర్‌ను దోషిగా నిర్దారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాస్ హైకోర్టు అతని శిక్షను 7 సంవత్సరాలకు తగ్గించింది. అయితే, శిక్ష తర్వాత పిటిషనర్ వెంటనే భారతదేశం విడిచి వెళ్లాలని, అప్పటి వరకు శరణార్థి శిబిరంలోనే ఉండాలని ఆదేశించింది. 2009లో ఎల్‌టీటీఈ మాజీ సభ్యుడిగా శ్రీలంక యుద్ధంలో పోరాడినందున, తనను శ్రీలంకలో బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారని పిటిషనర్ తెలిపారు. మళ్లీ తనను శ్రీలంక పంపితే అరెస్టుతో పాటు హింసను ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరపున ఆర్ సుధాకరన్, ఎస్ ప్రభు రామసుబ్రమణియన్, వైరవన్ వాదనలు వినిపించారు.ఇటీవల రోహింగ్యా శరణార్థులకు సంబంధించిన కేసులోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 2015లో పిటిషనర్‌తో పాటు మరో ఇద్దరిని ఎల్‌టీటీఈకి చెందిన వ్యక్తులుగా భావించి తమిళనాడు క్యూ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.