నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్ చేరకూడదని వామపక్షాలు పేర్కొన్నాయి. ఐదు వామపక్ష పార్టీలు సంయుక్తంగా బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ (ఎం-ఎల్ లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఫార్వర్డ్‌బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘గాజా శాంతి ప్రణాళిక’ అమలు పేరుతో ఉద్దేశించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో భారత ప్రభుత్వాన్ని చేరకూడదని కోరుతున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.
అమెరికా ప్రతిపాదించిన వైఖరిని అంగీకరించవద్దని తెలిపింది. పాలస్తీనియా ప్రజల హక్కులను గౌరవించని అటువంటి కమిటీలో భారత్ చేరడమంటే పాలస్తీనా డిమాండ్లకు ద్రోహం చేయడమే అవుతుందని మండిపడింది. ట్రంప్ రూపొందించిన ఈ ప్రతిపాదన ఉద్దేశ్యం .. ఐక్యరాజ్యసమితిని తప్పించి, ప్రపంచదేశాలను అమెరికా నియంత్రణలోకి తీసుకువచ్చే కొత్త అంతర్జాతీయ నిర్మాణాన్ని ప్రవేశపెట్టడమేనని దుయ్యబట్టింది. ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సంస్థలను అధిగమించడానికి అమెరికా చేస్తున్న యత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని పేర్కొంది. భారత ప్రభుత్వం అటువంటి ప్రతిపాదలనకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అమెరికా సామ్రాజ్యవాద ఆంక్షలతో ముప్పు పొంచి వున్న పాలస్తీనా, అభివృద్ధి చెందుతున్న దేశాల రక్షణకు ధృడంగా నిలవాలని పేర్కొంది.



