నవతెలంగాణ-హైదరాబాద్: దేశీయ అవసరాల కోసం అమెరికా నుంచి భారీ ఎత్తున లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) దిగుమతి చేసుకునేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీ తాజాగా ప్రకటించారు. ప్రజలకు అందుబాటు ధరలో వంటగ్యాస్ అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
భారత ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) అమెరికన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని హర్దీప్‌సింగ్ పురీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ డీల్ ఏడాది పాటు అమల్లో ఉంటుందని, దీని ద్వారా యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఏటా 2.2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకోనుందని పేర్కొన్నారు. ఇది దేశ వార్షిక ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 10 శాతానికి సమానమని వివరించారు.



