Tuesday, April 29, 2025
Navatelangana
Homeజాతీయంబీబీసీకి భారత్‌ వార్నింగ్‌

బీబీసీకి భారత్‌ వార్నింగ్‌

  • – పహల్గాం ఉగ్రదాడి కవరేజీపై ఆగ్రహం
    – సదరు మీడియా సంస్థ కథనం
    – పై అభ్యంతరంశీర్షిక, పదాల వినియోగం తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని వెల్లడి
    – బీబీసీ ఇండియా అధిపతిని మందలిస్తూ కేంద్రం లేఖ

    న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇస్తున్న కవరేజీపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కాశ్మీర్‌లో పర్యాటకులపై ఘోరమైన దాడి తర్వాత పాకిస్తాన్‌ భారతీయులకు వీసాలను నిలిపివేసింది’ అనే శీర్షికతో సదరు మీడియా సంస్థ ప్రచురించిన కథనంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ శీర్షిక తప్పుదారి పట్టించేదిగా ఉన్నదనీ, భారత్‌ను హంతకుడిగా తప్పుగా చిత్రీకరిస్తుందని వివరించింది. బీబీసీ హెడ్డింగ్‌ తప్పుదారి పట్టించేదిగా ఉన్నదని సోషల్‌ మీడియాలో పలువురు యూజర్లు సైతం తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ భారత్‌లోని బీబీసీ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న జాకీ మార్టిన్‌కు అధికారిక లేఖను రాసింది. అలాగే, సదరు కథనంలో ‘ఉగ్రదాడి’కి బదులు.. ‘మిలిటెంట్‌ అటాక్‌’గా అభివర్ణించటం పైనా భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీబీసీ ఇండియా హెడ్‌ జాకీ మార్టిన్‌ను మందిలించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇకపై బీబీసీ కవరేజీని పరిశీలిస్తుందని పేర్కొన్నది. విశ్లేషకుల ప్రకారం.. హింసతో సమాజంలో భయం కలిగించి వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికస్థితి తదితరాలు దెబ్బతీసేది ఉగ్రవాదం. దీనినే ఆంగ్లంలో టెర్రిజం అని అంటారు. దీనికి రాజకీయ, మత, ప్రాంత తదితర కారణాలుంటాయి. సామాజిక, రాజకీయ లక్ష్యాలతో హింసకు పాల్పడేవారు తీవ్రవాదులు. వీరిని మిలిటెంట్స్‌ అని కూడా పిలుస్తారు. ఈ రెండూ అనుసరించేవి హింస మార్గాలే అయినా.. ఉద్దేశాలు వేరు అని విశ్లేషకులు చెప్తున్నారు.పాక్‌ యూట్యూబ్‌ ఛానెళ్లపై బ్యాన్‌పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ మరో నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించింది. ఉగ్రదాడి తర్వాత రెచ్చగొట్టే, సున్నితమైన కంటెంట్‌ను వ్యాప్తి చేసినందుకు, భారత్‌, సైన్యంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయటంతో భారత్‌లో మొత్తం 63 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు కలిగి ఉన్న ఈ యూట్యూబ్‌ ఛానెళ్లను బ్యాన్‌ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసుల మేరకు ఈ యూట్యూబ్‌ ఛానెళ్ల నిషేధం జరిగింది.భారత్‌ నిర్ణయంతో పాక్‌కు చెందిన సదరు యూట్యూబ్‌ ఛానెళ్లు కనిపించటం లేదు. డాన్‌, సమా టీవీ, ఏఆర్‌వై, జియో, బోల్‌, రఫ్తార్‌, సునో న్యూస్‌ వంటి వార్త ఛానెళ్లు కూడా ఇందులో ఉన్నాయి. జర్నలిస్టులు ఇర్షాద్‌ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్‌ చీమా, మునీబ్‌ ఫరూక్‌ల యూట్యూబ్‌ ఛానెళ్లు కూడా నిషేధానికి గురయ్యాయి. పాకిస్తాన్‌కు చెందిన మాజీ క్రికెటరల్‌ షోయబ్‌ అక్తర్‌కు చెందిన అకౌంట్‌ కూడా కనిపించలేదు. ది పాకిస్తన్‌ రిఫరెన్స్‌, సమా స్పోర్ట్స్‌, ఉబైర్‌ క్రికెట్‌, రజి నామా వంటి యూట్యూబ్‌ ఖాతాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ కంటెంట్‌ను తొలగించినట్టు ఆయా ఛానెళ్లల్లో సందేశం కనిపిస్తున్నది.
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు