నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని, దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఇండియా సహకరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ ఎగుమతులపై అదనపు సుంకాలు విధించారు. ఈక్రమంలో తాజాగా ఈ వ్యవహారంపై యూఎస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈమేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరిని చేయడంలో ఇదొక కీలక అడుగని అభివర్ణించారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై ప్రధాని మోదీ వద్ద తాను ఆందోళన వ్యక్తం చేశానని ట్రంప్ చెప్పారు. మాస్కో నుంచి భారత్ చమురు కొనడం వల్ల ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు పుతిన్ ఆ నిధులు ఉపయోగిస్తున్నారని అమెరికా భావిస్తున్నదని తెలిపారు. ఈ కొనుగోళ్లపై తాను సంతోషంగా లేనని చెప్పాను. ఈ సందర్భంగా ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రధాని మోదీ ఈరోజు తనకు హామీ ఇచ్చారని. ఇదొక కీలక ముందడుగు అని చెప్పారు. చైనా కూడా రష్యా ఆయిల్‌ను కొనకుండా చేస్తానని, ఇక అదే మిగిలి ఉందని తెలిపారు. భారత్, చైనా.. అమెరికాతో కలిసి వస్తే పుతిన్ చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.