నవతెలంగాణ-హైదరాబాద్ : భారత జాతీయ పోల్ వాల్ట్ రికార్డ్ హోల్డర్ దేవ్ మీనాకు, మరో అథ్లెట్ కుల్దీప్ యాదవ్‌కు రైలులో చేదు అనుభవం ఎదురైంది. తమ క్రీడా పరికరాలైన పోల్స్‌ను రైలులో తీసుకెళ్తున్నారన్న కారణంతో టికెట్ తనిఖీ అధికారి (టీటీఈ) వారిని రైలు నుంచి బలవంతంగా దించేశారు. ఈ సంఘటన పన్వేల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రైలులో పోల్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని టీటీఈ వాదించి, వారిని పన్వేల్ స్టేషన్‌లో దిగిపొమ్మని ఆదేశించారు. దీంతో ఇద్దరు అథ్లెట్లు సుమారు ఐదు గంటల పాటు స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను NNIS అనే స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అథ్లెట్లు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి వివరిస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో జాతీయ స్థాయి క్రీడాకారుల పట్ల రైల్వే సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోల్ వాల్ట్ అథ్లెట్లు తమ పరికరాలతో ప్రయాణించేటప్పుడు ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు అథ్లెట్లు ఇవే సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ వివాదంపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దేవ్ మీనా 5.35 మీటర్ల ఎత్తును అధిగమించి పురుషుల పోల్ వాల్ట్‌లో జాతీయ రికార్డు సృష్టించాడు.



