Wednesday, April 30, 2025
Homeఆటలుభారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఆవేదన

భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఆవేదన

నవతెలంగాణ-న్యూఢిల్లీ
సోషల్‌ మీడియా వేదికగా వస్తున్న విమర్శలపై భారత స్టార్‌ అథ్లెట్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా స్పందించాడు. మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో కొందరు నీరజ్‌ చోప్రాపై ఆన్‌లైన్‌లో విమర్శలతో పాటు కుటుంబ సభ్యులను దూషించటం మొదలెట్టారు. ఏండ్లుగా నా దేశం గర్వాన్ని మోస్తున్నాను, ఇప్పుడు నా నిజాయితీ, విలువలు ప్రశ్నార్థకం కావటం బాధించింది. నా ప్రజలే నన్ను, నా కుటుంబాన్ని దూషించటం కలిచివేసిందని నీరజ్‌ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్‌లైన్‌ విమర్శలపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నీరజ్‌ చోప్రా స్పందించాడు. ఈ ఏడాది మే 24న బెంగళూర్‌లోని కంఠీరవ అథ్లెటిక్స్‌ స్టేడియంలో నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ (జావెలిన్‌ త్రో) ఈవెంట్‌లో (ప్రపంచ అథ్లెటిక్స్‌ కేటగిరీ ఏ ఈవెంట్‌) పోటీపడేందుకు రావాల్సిందిగా పారిస్‌ ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత అర్షద్‌ నదీమ్‌ను నీరజ్‌ చోప్రా ఆహ్వానించాడు. అర్షద్‌ నదీమ్‌ను నీరజ్‌ సోమవారం ఆహ్వానించగా.. ఆ తర్వాత ఉగ్రదాడి జరిగింది. దీంతో పాకిస్థాన్‌ అథ్లెట్‌ను ఆహ్వానించిన నీరజ్‌ చోప్రాపై ఆన్‌లైన్‌ విమర్శలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, షెడ్యూల్‌ కారణాలతో నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ ఈవెంట్‌కు రాలేనని అర్షద్‌ నదీమ్‌ బుధవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అథ్లెట్‌గా ఓ అథ్లెట్‌ను పిలిచా!
‘ఓ అథ్లెట్‌గా అర్షద్‌కు ఇన్విటేషన్‌ పంపించాను. అంతకుమించి, అందులో ఏమీ లేదు. నీరజ్‌చోప్రా క్లాసిక్‌ ఉద్దేశమే ప్రపంచ ఉత్తమ అథ్లెట్లు భారత్‌లో పోటీపడేలా చేయటం. అథ్లెట్లు అందరికీ సోమవారమే ఆహ్వానం పంపించాం. ఆ తర్వాత పహల్గామ్‌ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడి తర్వాత అర్షద్‌ నీరజ్‌ క్లాసిక్‌లో పోటీపడతాడనే ప్రశ్నే లేదు. నాకు ఎప్పుడూ నా దేశ ప్రయోజనాలే ముఖ్యం. దేశ ప్రజలందరి మాదిరిగానే, పహల్గామ్‌ ఉగ్రదాడితో బాధపడటంతో పాటు ఆగ్రహానికి లోనయ్యాను. కొన్నేండ్లుగా దేశ గర్వాన్ని మోస్తున్నాను. నా విలువలు, నిజాయితీ, సమగ్రతను ప్రశ్నించటం బాధాకరం. నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండగా.. నా ప్రజలకు వివరణ ఇవ్వాల్సి రావటం బాధాకరం. మేము ఎంతో సాధారణ ప్రజలం, దయచేసి మమ్మల్ని ఎదో చేయాలని అనుకోకండి. ఓ వర్గం మీడియాలో నా గురించి ఎన్నో తప్పుడు కథనాలు వస్తున్నాయి, నేను స్పందించనంత మాత్రాన అబద్దాలు నిజాలు కాజాలవు’ అని చోప్రా రాసుకొచ్చాడు.
పొగిడింది మీరే, తిట్టేది మీరే
ప్రజలు తమ అభిప్రాయాలను వేగంగా మార్చుకోవటం పట్ల నీరజ్‌ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా సిల్వర్‌ మెడల్‌ సాధించగా.. పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ బంగారు పతకం నెగ్గాడు. ఆ సమయంలో నీరజ్‌ చోప్రా తల్లి సరోజ్‌ మాట్లాడుతూ..’ నీరజ్‌ రజతం నెగ్గినందుకు బాధ లేదు. బంగారం గెల్చుకున్న అర్షద్‌ కూడా నా బిడ్డే’ అని వ్యాఖ్యానించింది. ‘ప్రజలు తమ అభిప్రాయాలను మార్చుకోవటాన్ని నేను ఏమాత్రం అర్థం చేసుకోలేక పోతున్నాను. మా అమ్మ ఏడాది క్రితం చేసిన ఓ వ్యాఖ్యకు అప్పట్లో ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే మాటను పట్టుకుని.. మా కుటుంటాన్ని దూషిస్తున్నారు’ అని నీరజ్‌ చోప్రా అన్నాడు.
ఆసియా చాంపియన్స్‌కు దూరం
ఏఎఫ్‌ఐ ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌ప్స్‌కు అగ్రశ్రేణి అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా దూరమయ్యాడు. కోచి వేదికగా జరిగిన ఫెడరేషన్‌ కప్‌ అనంతరం భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు టీమ్‌ ఇండియా జట్టును ప్రకటించాడు. మే 27 నుంచి దక్షిణ కొరియాలోని గుమిలో ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగనుండగా.. మే 24న బెంగళూర్‌లో ఎన్‌సీ క్లాసిక్‌ ఈవెంట్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. మెన్స్‌ జావెలిన్‌ ఈవెంట్‌లో సచిన్‌ యాదవ్‌, యశ్‌ వీర్‌ సింగ్‌లు పోటీపడనున్నారు. ఆసియా, ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ సైతం ఆసియా చాంపియన్‌షిప్స్‌ జట్టులో చోటు సాధించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img