నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియాలోని బర్కిలీలో కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన సాకేత్ శ్రీనివాసయ్య (22) మరణించినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ఆదివారం ధ్రువీకరించింది. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం నుంచి సాకేత్ కనిపించడం లేదంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సాకేత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కాన్సులేట్ తన ప్రకటనలో తెలిపింది. సాకేత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూసీ), బర్కిలీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. గతంలో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు.
“స్థానిక పోలీసులు భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము” అని కాన్సులేట్ కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసింది. పోలీసుల నివేదికల ప్రకారం సాకేత్‌ను చివరిసారిగా లేక్ అంజా సమీపంలో చూశారు. గాలింపు చర్యల అనంతరం అక్కడే అతడి మృతదేహం లభించినట్లు తెలిసింది. అతడి అదృశ్యం వెనుక గల కారణాలపై పోలీసులు స్పష్టత ఇవ్వనప్పటికీ, అతడు ‘రిస్క్’లో ఉన్నట్లుగా భావించి గాలింపు చేపట్టారు. మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.



