నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవడంపై ఏర్పడిన సంక్షోభం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో …. ప్రయాణికుల టికెట్ రీఫండ్‌లపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. రీఫండ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి సంస్థ అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఇండిగో విమానాల రద్దు సమస్యను పరిష్కరించడానికి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై, ఈ సంక్షోభం కారణమైన అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపింది.
ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి, సీఈఒ, బోర్డు సభ్యుల సహకారంతో క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ గ్రూప్ రద్దయిన విమానాలను తిరిగి పునరుద్ధరించేందుకు, అలాగే ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇంకా, రద్దయిన విమానాల రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్‌లు, ఇతర అనుబంధ సమస్యలపై మినహాయింపులు ఇవ్వడంపై బోర్డు సభ్యులు తన ప్రణాళికలను కొనసాగిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.



