Wednesday, May 21, 2025
Homeప్రధాన వార్తలుశృతి మించుతున్న ఇందిరమ్మ ఇండ్ల గోల

శృతి మించుతున్న ఇందిరమ్మ ఇండ్ల గోల

- Advertisement -

– కటిక పేదకు మొదటి ప్రాధాన్యతన్న మంత్రి పొంగులేటి
– క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఇష్టారాజ్యం
– ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న కొత్త, పాత కాంగ్రెస్‌ వర్గీయులు
– ఎవరి జాబితాతో వారు.. తారుమారవుతున్న పేర్లు
– కొన్నిచోట్ల బహిరంగంగానే ఫైట్లు.. కేసులు పెడతామని బెదిరింపులు
– కమిటీల ప్రాధాన్యతలతో యాప్‌ టెక్నాలజీ హుష్‌పటాక్‌..!
– మితిమీరిన రాజకీయ జోక్యం.. లోపించిన పారదర్శకత
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఇందిరమ్మ ఇండ్ల గోల శృతి మించుతోంది. ఇందిరమ్మ కమిటీల మితిమీరిన జోక్యంతో లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రమేయం అధికమవుతోంది. గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతున్న దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో ఎంపికలు జరుగుతున్నాయి. కఠిక పేదలు, నిరుపేదలు, పేదలు.. ఇలా విడతలవారీగా ఎంపికలు ఉండాలని ఆయన సూచిస్తున్నారు. కానీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఇష్టా అయిష్టాల ముందు అవేవీ పనిచేయటం లేదు. కమిటీలో సభ్యులకు నచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ నచ్చకపోతే దూరం పెడుతున్నారు. లబ్దిదారుల ఎంపికలో కులం, మతం, పార్టీలు చూడమని మంత్రి ప్రకటిస్తున్నా.. అవేవీ ఆచరణకు నోచుకోవటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మొదటి జాబితాలో 562 గ్రామాల పరిధిలో 70,122 ఇండ్లకు అనుమతి ఇచ్చారు. ఇందులో 46,432 ఇండ్లకు మంజూరు పత్రాలు అందాయి. 17వేల మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 4,500 ఇండ్ల పునాది పూర్తయినట్టు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇలా పునాది పూర్తయితే మొదటి దశలో రూ.లక్ష మంజూరు చేస్తారు. కాబట్టి అప్‌లోడ్‌ చేసిన వివరాలను అధికారులు ఏఐ సాంకేతికతతో జల్లెడ పడుతున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాను ఇన్‌చార్జి మంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. ఈలోపు గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు సర్వే చేయాలి. కానీ ఈ ప్రక్రియలో రాజకీయ జోక్యం అధికమవుతుండటం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది.
ఎవరి లిస్టు వారిదే..!
రాష్ట్రంలో అనేక చోట్ల బీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ ఇతరత్ర పార్టీల నుంచి పలువురు నాయకులు ఎన్నికల ముందు, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. అప్పటికే పార్టీలో ఉన్న పాత కాంగ్రెస్‌ నేతలు పలు చోట్ల ఉనికి కోల్పోయారు. దాదాపు ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్‌లో మూడు, నాలుగు వర్గాలున్నాయి. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు కొందరుంటే.. అక్కడ పేరున్న నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు, మంత్రి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వర్గీయులు కొందరున్నారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో ఏ మంత్రికి ఆ మంత్రి వర్గాలున్నాయి. వీరిలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో చోటు లభించిన వారు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. వర్గాల వారీగా తమ ఆధిక్యతను చాటుకోవాలనే రీతిలో ఎంపికలు చేయిస్తున్నారు. ఎవరి జాబితా వారు సిద్ధం చేసుకొని అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ఎమ్మెల్యే, లేదంటే నియోజకవర్గ ఇన్‌చార్జి, సంబంధిత అధికారుల ముందు ఉంచుతున్నారు. ఎవరి లిస్టు ఫైనల్‌ చేస్తే ఏ తంటా వస్తుందోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య అనేక గ్రామాల్లో రాత్రికి రాత్రే జాబితాలు తారుమారవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల ప్రకటనలతో దరఖాస్తుదారులంతా మొదటి జాబితాలోనే పేరు రావాలని ఆరాటపడుతున్నారు. ఆ తర్వాత కేటాయింపులు ఉంటాయో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆ ప్రాంతంలో ప్రభావితం చేయగల నేతలకు తృణమోపణమో ఇస్తున్నట్టు తెలుస్తోంది. మందు విందుల్లో కొందరు పసందు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా జాబితాలో చోటు ఇవ్వని పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న నాయకులు కొందరు చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
దరఖాస్తుదారుపై బూటుతో దాడి..
పినపాక నియోజకవర్గం మణుగూరులో ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. మణుగూరు తహసీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట అధికార పార్టీ నాయకులు చలపతి దరఖాస్తుదారున్ని తన బూటుతో బాదుతూ బూతులు లంకించుకున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నారం గ్రామానికి చెందిన చలపతిపై శ్రీను అనే వ్యక్తి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని దాడి చేసుకునేంత వరకూ వచ్చింది. అనేక గ్రామాల్లో ఇలాంటి వివాదాలే నడుస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.
పేర్లను తారుమారు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అన్ని అర్హతలున్నా తమకు నచ్చని పేర్లను తొలగించి.. మూడు, నాలుగు జాబితాల్లో రావాల్సిన పేర్లను మొదటి జాబితాలోనే చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. కూసుమంచి మండలం బోడియాతండా గ్రామపంచాయతీ బండమీద తండాకు చెందిన భూక్యా రాజేశ్‌ పేరు ఇందిరమ్మ లబ్దిదారుల మొదటి జాబితాలో ఉంది. గ్రామసభలో ఎంపిక చేసిన లిస్టులో ఆయన పేరు ఉన్నా ఆ తర్వాత రాజకీయ కారణాలతో తొలగించారు. గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కుంట భూమి లేని రాజేశ్‌ పేరును తొలగించి మూడు నుంచి ఐదారు ఎకరాల భూమున్న రైతుల పేర్లను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని రాజేశ్‌ మీడియా దృష్టికి తీసుకురావడంతో అతన్ని బెదిరించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓవైపు సెకండ్‌ లిస్టులో చేర్చుతామని చెబుతూనే.. మరోవైపు కేసు నమోదు చేయాల్సిందిగా గ్రామ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు మండల కాంగ్రెస్‌ ముఖ్యనాయకుని ద్వారా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -