Monday, March 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి..ఖండించిన ఇండోనేషియా

లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి..ఖండించిన ఇండోనేషియా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయిల్ చేసిన దాడిలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు మృతి చెందారు. మృతుడు ఇండోనేషియా దేశస్థుడేనని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దక్షిణ లెబనాన్‌లోని అద్చిత్ అల్ ఖుసాయిర్ సమీపంలో యునైటెడ్ నేషన్స్ ఫోర్సు ఇన్ లెబనాన్ (యుఎస్ఐఎఫ్ఐఎల్) దళం స్థావరంపై జరిగిన పరోక్ష ఫిరంగి కాల్పుల్లో ఒక శాంతి సైనికుడు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. గాయపడిన వారంతా కూడా ఇండోనేషియా సైనికులేనని పేర్కొంది. ఈ ఘటనను ఇండోనేషియా తీవ్రంగా ఖండిస్తూ, పూర్తి స్థాయి పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. “ఈ నష్టం పట్ల మేము తీవ్రంగా విచారిస్తున్నాము. అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతి పరిరక్షకుల భద్రతను ఎల్లప్పుడూ గౌరవించాలి. వారికి ఎలాంటి హాని జరిగినా అది ఆమోదయోగ్యం కాదు. శాంతి, స్థిరత్వాన్ని కాపాడటానికి జరుగుతున్న సామూహిక ప్రయత్నాలను దెబ్బతీస్తుంది” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇక దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైనిక దళాలు మరియు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలను పర్యవేక్షించేందుకు యుఎస్ఐఎఫ్ఐఎల్ దళాలు మోహరించబడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా, లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులను ఇండోనేషియా ఖండిస్తూ, అన్ని పక్షాలు లెబనాన్ సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -