Tuesday, April 29, 2025
Navatelangana
Homeజాతీయంపడకేసిన పారిశ్రామికోత్పత్తి

పడకేసిన పారిశ్రామికోత్పత్తి

- Advertisement -

నాలుగేండ్ల కనిష్టానికి పతనం
– 2024-25లో 4 శాతానికి పరిమితం
– తయారీ, మైనింగ్‌, విద్యుత్‌ రంగాలు వెలవెల
– మార్చిలోనూ 3 శాతమే :కేంద్ర గణాంకాల శాఖ రిపోర్టు

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని బీజేపీ పాలకులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. దేశ ప్రగతికి గీటురాయిగా భావించే పారిశ్రామిక రంగం ఉత్పత్తిలో ప్రమాద ఘంటికలు మోగుతోన్నాయి. అధిక ధరలతో ప్రజల ఆదాయాలు సన్నగిల్లడంతో డిమాండ్‌ దెబ్బతింటోంది. ఫలితంగా కొనుగోళ్లు తగ్గి పారిశ్రామిక ఉత్పత్తి పడకేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగుదల 4 శాతానికి పరిమితమైంది. ఇది గడిచిన నాలుగేండ్లలో అత్యల్పం కావడం గమనార్హం. కేంద్ర గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం ఐఐపీ గణంకా లను విడుదల చేసింది. ఇందులో ప్రధాన రంగాలన్నీ ఉత్పత్తిలో వెనుకబడిపోయాయి. కోవిడ్‌ తర్వాత ఇదే తక్కువ వృద్ధి కావడం విశేషం. ఇంతక్రితం 2023-24లో ఐఐపీ 5.9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2022-23లో 5.1 శాతంగా చోటు చేసుకుంది. 2021-22లో 11.4 శాతం వృద్ధి చోటు చేసుకుంది. కరోనా సమయం 2020-21లో మైనస్‌ 8.4 శాతం ప్రతికూల వృద్ధిని చవి చూసింది. ఆ తర్వాత గతేడాది అత్యల్పంగా పడిపోయింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా తయారీ రంగం అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చగా.. మైనింగ్‌, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి పడకేసింది.ప్రధాన రంగాలు క్షీణత..2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నెలలోనూ పారిశ్రామికోత్పత్తిలో పెద్ద పురోగతి కానరాలేదు. ఎన్‌ఎస్‌ఓ గణంకాల ప్రకారం.. మార్చి నెలలో ఐఐపీ 3 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది. 2024 మార్చిలోని 5.5 శాతంతో పోల్చితే సగానికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోని 2.7 శాతంతో పోల్చితే స్వల్పంగా పెరిగినప్పటికీ.. ఇది భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సరిపోదు. 2025 ఫిబ్రవరిలో ముందుగా ప్రకటించిన 2.9 శాతాన్ని.. 2.7 శాతంగా సమీక్షించింది. 2025 మార్చిలో తయారీ రంగం సగానికి పతనమై 3 శాతంగా నమోదయ్యింది. ఈ రంగం గతేడాది ఇదే నెలలో 5.9 శాతం వృద్ధిని కనబర్చింది. ఇదే సమయంలో గనుల రంగం 1.3 శాతం వృద్ధిని నమోదు చేయగా.. గడిచిన నెలలో ఏకంగా 0.4 శాతానికి పడకేసింది. విద్యుత్‌ రంగం గడిచిన మార్చిలో 6.3 శాతానికి పరిమితమయ్యింది. ఈ రంగం గతేడాది ఇదే నెలలో ఏకంగా 8.6 శాతం వృద్ధిని సాధించింది. కొనలేకపోతున్నారు..?గడిచిన నెలలో వాహనాలు, గృహోపకరణాల లాంటి కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ ఉత్పత్తి 6.6 శాతానికి మందగించింది. ఈ రంగం 2024 ఇదే నెలలో 9.5 శాతం వృద్ధిని సాధించింది. 2025 ఫిబ్రవరిలో మిషనరీ, వాహనాలు, ఫ్యాక్టరీ, ముడి సరుకులు తదితర మూలధన వస్తువుల విభాగం వృద్ధి మాత్రం 2.4 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం ఏడాది ఈ విభాగం ఉత్పత్తి 7 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చిలో కాస్మోటిక్స్‌, ఆహారం, పానియాలు, ఇంధనం, వస్త్రాలు, పాదరక్షలు తదితర కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరెబుల్‌ గూడ్స్‌ ఉత్పత్తి 4.7 శాతానికి పడిపోయింది. ఇలాంటి సాధారణ అవసరాలకు ఉపయోగించే వస్తువులను కూడా ప్రజలు కొనలేని స్థితికి తగ్గిపోతున్నారని స్పష్టం అవుతోంది. 2024 ఇదే నెలలో కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరెబుల్స్‌ ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా ఉంది. ఇదే నెలలో మౌలిక వసతులు, నిర్మాణ రంగం ఉత్పత్తుల వృద్ధి 8.8 శాతంగా ఉండగా.. 2025 ఫిబ్రవరిలో 7.4 శాతంగా నమోదయ్యింది. కలప, స్టీల్‌, గ్లాస్‌, విలువైన లోహాలతో చేసిన తుది వస్తువులకు సంబంధించిన ఇంటర్మీడియట్‌ గూడ్స్‌ ఉత్పత్తి 2.3 శాతానికి పడిపోయింది. ఈ విభాగం 2024 ఇదే నెలలో 6.1 శాతం పెరుగుదలను సాధించింది. ప్రజల ఆదాయాలు పెంచడమే మార్గం..స్థూలంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పడిపో యిందని ఎన్‌ఎస్‌ఒ గణంకాలు స్పష్టం చేసింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో దేశంలో డిమాండ్‌ సన్నగిల్లడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిణామాలు ఉపాధి కల్పనపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా.. మున్ముందు పరిస్థితు లు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారి తీయనుందని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. ధరలను అదుపు చేయడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం.. అదే విధంగా ప్రజల ఆదాయాలను పెంచే విధాన చర్యల ద్వారా మాత్రమే వస్తు ఉత్పత్తికి డిమాండ్‌ను పెంచడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తి, దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతును ఇవ్వగలమని సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు