నిరంతరం ఆకస్మిక తనిఖీలు
రాష్ట్ర విద్యా శాఖ పరిశీలికులు శ్రీనివాస్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి, నసురుల్లాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర పరిశీలకులు, ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఎంఇఓ చందర్ లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకు నసురుల్లాబాద్ పాఠశాలలో ప్రతిజ్ఞ జరిగే సమయానికి విద్యాశాఖ రాష్ట్ర పరిశీలికులు శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో అమలవుతున్న పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే నెమ్లి జడ్పి హై స్కూల్ లో ఆయన మధ్యాహ్నం భోజనం వండుతున్న తీరును, పాఠశాలల పరిసరాలు, పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం, చదువు అత్యంత ప్రాధాన్యమైనవని అన్నారు.
అదేవిధంగా పాఠశాల వసతులు, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు. పాఠశాలలో వసతులు, విద్యార్థుల ఆహార మెనూ, వంట గదిని పరిశీలించారు. రోజువారి మెనూ ను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి భోజన నాణ్యతపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని తెలిపారు. ఇక నుంచి పైఅధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఏదేని లోపం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



