Sunday, July 6, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి''ఇంక్విలాబ్‌ జిందాబాద్‌''

”ఇంక్విలాబ్‌ జిందాబాద్‌”

- Advertisement -

పెద్ద మిఠాయి డబ్బా పట్టుకుని ఉత్సాహంగా ఇంట్లోకి వచ్చాడు కమలేష్‌. భార్యను, కొడుకును కేకలేసి పిలిచాడు. మిఠాయిలు తీసి వాళ్లిద్దరి నోట్లో పెట్టి తాను కూడా నోట్లో ఒక పెద్ద లడ్డూ పెట్టుకున్నాడు.
”ఎందుకండి మిఠాయిలు తెచ్చారు? మీకు జీతాలు పెరిగినట్లు ఎక్కడా ప్రచారం కూడా లేదు! ప్రమోషన్‌ ఏమైనా వచ్చిందా?” అడిగింది లక్ష్మి ఉత్సాహంగా.
”అదేం కాదు! పెద్దాయనకు అవార్డు వచ్చింది! అందుకే ఈ స్వీట్లు తెచ్చాను! తినండి!’ అంటూనే ఒక కాకినాడ కాజా నోట్లో వేసుకున్నాడు.
”నేను మైసూర్‌ పాక్‌ తింటాను! ఇంతకూ పెద్దాయన అంటే ఎవరు డాడీ?” అంటూ బిట్టుగాడు మైసూర్‌ పాక్‌ తీసుకోబోయాడు.
బిట్టుగాడి చేయిమీద ఒక్క దెబ్బ వేశాడు కమలేష్‌.
”వెధవా! పెద్దాయన అంటే ఎవరో తెలియదు! మైసూర్‌పాక్‌ను మైసూర్‌శ్రీ అని పేరు మార్చిందీ తెలియదు! నా కడుపున ఎలా పుట్టావురా?” అని కస్సుమన్నాడు కమలేష్‌.
”వాడు మీలాగా వాట్సాప్‌ చూడడు. పుస్తకాలు మాత్రమే చదువుతాడు! అందుకే మీ అంత జ్ఞానం లేదు! ఇదిగో నా మైసూర్‌ పాక్‌ తీసుకో! ” అంటూ మైసూర్‌ పాక్‌ కొడుకు నోట్లో పెట్టింది లక్ష్మి.
అసలు తన్నాల్సింది నిన్నే! వాడిని పూర్తిగా చెడగొట్టావు! మన పెద్దాయన, ప్రధాని మోడీకి అవార్డు వస్తే మిఠాయిలు తెస్తే ఆబాగా తింటున్నారు! కానీ అవార్డు వచ్చినందుకు మీరు సంతోషించారా?” అంటూ లక్ష్మిని కొట్టినంత పనిచేశాడు. కమలేష్‌.
”మీరు సంతోషించి, మిఠాయిలు తెచ్చారుగా చాలు! మేము కూడా సంతోషించి ఏం చేయమంటారు?” అన్నది లక్ష్మి ఒక గులాబ్‌ జామున్‌ తీసి కొడుకు నోట్లో పెడుతూ.
తల్లీకొడుకులకు పూర్తిగా దేశభక్తి లేదు! మీరిద్దరూ దేశ ద్రోహులే! ఎందుకంటే మన ప్రధానికి అవార్డు వస్తే సంతోషించకుండా, మిఠాయిలు మాత్రం మెక్కుతున్నారు! సిగ్గనిపించటం లేదా?” కోపంగా అన్నాడు కమలేష్‌.
”మిఠాయిలు తినటానికి సిగ్గెందుకు డాడీ! ఇంతకూ పెద్దాయనకు అవార్డు ఎందుకొచ్చింది. చెప్పు! అమ్మా ఈ బాదుషా తిను!” అంటూ బిట్టుగాడు తల్లి నోట్లో బాదుషా పెట్టాడు.
”ఈ బాదుషా పేరు కూడా మారాలి! ఆ సంగతి తర్వాత చూద్దాం! పెద్దాయనకు ఘనా దేశం వాళ్లు ఆవార్డు ఇచ్చారు. భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని, పెద్దాయన ప్రపంచ నాయకుడని, ఈ అవార్డు ఇచ్చారు! అన్నట్టు ఇది 28వ అవార్డు తెలుసా? ఏ ప్రధానికి ఇన్ని అవార్డులు రాలేదు! నెహ్రూకి కూడా రాలేదు! అన్నాడు. నోబుల్‌ ప్రైజ్‌ కూడా తొందర్లోనే వస్తుంది!’ అన్నాడు కమలేష్‌ సంబరంగా.
”పెద్దాయనకు అవార్డులిచ్చిన దేశాలేవి డాడీ ” మోతీచూర్‌ లడ్డూ తింటూ అడిగాడు బిట్టుగాడు.
”ఆది! అలా అడుగు చెబుతాను! సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్‌, పాలస్తీనా, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌, కువైట్‌, ఫ్రాన్స్‌, గ్రీస్‌, అమెరికా ఇలా ఇరవై దేశాలు పెద్దాయనకు అవార్డులిచ్చాయి!” అన్నాడు కమలేష్‌ ఒక సున్నుండ నోట్లో వేసుకుంటూ.
”నాదొక డౌటు డాడీ! నీవు చెప్పిన దేశాల లిస్టులో ఎక్కువగా ముస్లిం దేశాలే ఉన్నాయి. ముస్లిం అంటే పెద్దాయనకు పడదుకదా! వాళ్లనెపుడూ భారత్‌లో ఉండొదని వాళ్ల పార్టీ అంటుంది కదా! మరి ముస్లిం దేశాలిచ్చిన ఆవార్డులు ఎలా తీసుకుంటారు?” అడిగాడు.
కమలేష్‌ గొంతులో సున్నండ అడ్డం పడింది! లక్ష్మి తెచ్చి ఇచ్చిన నీళ్లుతాగి కుదుట పడ్డాడు.
”ముస్లిం దేశాలు కూడా పెద్దాయనను ప్రపంచ నాయకుడని గుర్తించి, అవార్డులు ఇస్తున్నాయి! అందువల్ల తీసుకోవచ్చు తప్పేం లేదు అన్నాడు కమలేష్‌.
”మీరు అమాయకులనుకుని బాధపడాలో, లేక మూఢత్వంతో కొట్టుకునిపోతూ నష్టపోతున్నారని ఆవేదన పడాలో అర్థం కావట్లేదు!” అన్నది లక్ష్మి బాధకి.
”నీవు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు! నేను అమాయకుడినా ఎలా? మూఢత్వంతో కొట్టుకుని పోతున్నానా? అడిగాడు కమలేష్‌,
”అవును! నేను మిమ్మల్నే అన్నాను. మన ప్రధానికి ఇరవై ఎనిమిది ఆవార్డులు వచ్చాయని, ఇంట్లోకి మిఠాయిలు తెచ్చారు! సంతోషించాల్సిందే! మన ప్రధానికి అన్ని ఆవార్డులు రావటం మనకు గర్వకారణమే! కాని దేశంలోని పరిస్థితి ఏమిటీ అలోచించారా?” అన్నది లక్ష్మి.
”దేశానికేమయ్యింది! పెద్దాయన పాలనలో స్వర్ణయుగం నడుస్తున్నది.అది నువ్వు తెలుసుకో!” అన్నాడు కమలేష్‌ గర్వంగా హల్వా నోట్లో పెట్టుకుంటూ..
”స్వర్ణయుగం నడుస్తోందా? అసలు అదంటే ఏమిటో తెలుసా మీకు? మీకు జీతం పెరిగి ఎన్నేళ్లయ్యింది గుర్తుందా! మీరు పదేండ్ల కింద డ్యూటీకి ఉదయం వెళ్తే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చే వారు! ఇప్పుడు ఉదయం తెల్లవారు జామున డ్యూటీకి వెళ్తే అర్థరాత్రి వచ్చి, మళ్లీ తెల్లవారు జామున డ్యూటీకి వెళ్లి పోతున్నారు! మీమీద పనిభారం ఎంత పెరిగిందో తెలుసా? ప్రపంచమంతా ఎనిమిది గంటల పనిదినం అమలు చేస్తుంటే, మన దేశంలో,గుజరాత్‌లో 12గంటల పనిచేయాలంటూ ఆర్డినెన్స్‌ ఇచ్చారు. ఇది తెలుసా?” అడిగింది లక్ష్మి.
”దేశం కోసం ఎక్కువ గంటలు పనిచేస్తే తప్పేమిటి?” తిరిగి ప్రశ్నించాడు కమలేష్‌.
”నిజమే దేశం కోసం ఎంతైనా టైము పని చేయవచ్చు. కాని, ఆశ్రమ వల్ల వచ్చే లాభం అంతా కార్పొరేట్‌ కంపెనీలకు చెందుతుంటే దేశానికి ఏమైనా లాభం కలుగుతుందా?” ప్రశ్నించింది లక్ష్మి,
”కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి. వాళ్లకి జీతాలు వస్తాయి.ఇందులో అందరికీ లాభమే కదా!” అన్నాడు కమలేష్‌.
”అన్ని కార్పొరేట్‌ కంపెనీలలో కలిపి లక్షమంది ఉద్యోగులు కూడా లేరు! అదే ప్రభుత్వరంగ సంస్థల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి! అది చూసుకునే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు! ఈ పదేండ్లలో కనీసం కోటి ఉద్యోగాలైనా ఇచ్చారా?” నిలదీసింది లక్ష్మి.
కమలేష్‌ మిఠాయిలు తింటున్నాడు.
”దేశంలోని సంపద తయారుకావటానికి మీలాంటి కార్మికుల శ్రమే కారణం! కాని ఈ దేశంలోని కార్మికుల గురింది గత పదేండ్లలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు! పెద్దాయన వచ్చాక ప్రతి ఏడాది జరిగే లేబర్‌ కాంగ్రెస్‌ మీటింగులు రద్దు చేశారు! కార్మికులు ఎన్నోఏండ్లు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చి మీ హక్కులను కాలరాస్తున్న విషయం మీకు తెలుసా?” అడిగింది లక్ష్మి.
తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు కమలేష్‌,
”మీరొక వర్కర్‌! కాని మీకు మేలు కలిగించే చట్టాలేవో తెలియదు! అవి రద్దుచేసి, మీకు నష్టం కలిగించే చట్టాలు మీ అభిమాన ప్రధానే తీసుకొస్తున్న విషయం కూడా తెలియదు!ఆ లేబర్‌కోడ్స్‌లో ఏముందో తెలియదు! కాని ప్రధానికి ఎన్ని అవార్డులు వచ్చాయో, ఏయే దేశాలు ఇచ్చాయో మాత్రము నిద్రలో లేపినా చెప్పేస్తారు!” అన్నది లక్ష్మి
”మన ప్రధానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవటం తప్పా?” అడిగాడు కమలేష్‌.
”అది తప్పుకాదు కాని, మీ జీవితానికి నష్టం చేస్తున్న విషయాలు తెలుసుకోకపోవటం నేరం! లేబర్‌ కోడ్స్‌ అమలు జరిగితే మీలాంటి కార్మికులు అనుభవిస్తున్న హక్కులు కోల్పోతారు. జీతాలు పెరగవు. పని గంటలు పెరుగు తాయి. డ్యూటీలో ప్రమాదం జరిగి చనిపోయినా పట్టించుకునే దిక్కుండదు. రిటైర్మెంటు తర్వాత భరోసా ఉండదు! మీ తరపున మాట్లాడటానికి, కార్మిక సంఘాలు కూడా ఉండవు! మిమ్మల్ని చెప్పాపెట్టకుండా ఉద్యోగంలోంచి తీసేస్తే, మీతో పాటు, మేము కూడా రోడ్డున పడితే, పట్టించుకునేవారెవరు? మన బిట్టుగాడి భవిష్యత్తేమిటి? సిగాచి పరిశ్ర మలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కార్మికుల భార్యాబిడ్డలు, మా వాళ్ల శవాలు మాకివ్వండి, అని ప్రాధేయ పడుతుంటే, లాఠీలతో కొట్టి తరిమేస్తున్నారు! కార్మికచట్టాలుండగానే ఇలా ఉంటే, అవి రద్దయితే మనలాంటి వారి పరిస్థితి ఏమిటీ ఆలోచించండి !” అన్నది కన్నీళ్లతో లక్ష్మి.
కమలేష్‌ కదిలిపోయాడు, భార్యనీ, కొడుకునూ దగ్గరికి తీసుకున్నాడు.
”ఎవరికో ఆవార్డులు, ప్రైజులూ వస్తే మనకెందుకు డాడీ! నీవు మంచిగా ఉండాలి. సంతోషంగా డ్యూటీ నుండి ఇంటికి రావాలి! నీకు జీతం పెరిగిందని, ప్రమోషన్‌ వచ్చిందని, నీవు ఇంటికి స్వీట్లు తేవాలి! కాని ఇలాంటి విషయాలకు స్వీట్లు తీసుకుని రావద్దు డాడీ” అంటూ బిట్టుగాడు మిఠాయి డబ్బా బయటికి విసిరేశాడు.
”డాడీ! ఇన్నేళ్లు నీవు పెద్దాయన కోసం ఎంతో పనిచేశావు! కాని, ఇప్పుడు నీ కోసం, మా కోసం పని చేయి డాడీ. దేశంలోని కార్మికులంతా జూలై 9న సమ్మె చేస్తున్నారు! నీవు కూడా సమ్మెలో పాల్గొని వారికి మద్దతివ్వు డాడీ!” అన్నాడు బిట్టుగాడు.
”ఇంక్విలాబ్‌ జిందాబాద్‌” అన్నాడు కమలేష్‌.

– ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -