నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రైతులు సమగ్ర ఎరువుల యజమాన్యాన్ని పాటించాలని అధిక దిగుబడిని సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ అన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను కార్యక్రమం ఏరువాక కేంద్రం, యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.
రైతులు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించి అధిక దిగుబడి సాధించాలన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించాలనే తపనతో పంటలకు రసాయనిక ఎరువులను విచక్షణా రహితంగా వాడుతున్నారు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను వాడాలన్నారు. భూసారాన్ని, పండించే పంటను బట్టి ఏరువులను వాడాలన్నారు. రైతులు అధికంగా వినియోగిస్తున్న యూరియాను తగ్గించి సాగు ఖర్చును తగ్గించాలన్నారు.
ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన, విస్తరణ సంఘం సభ్యులైన మంతపురి యాదగిరి మాట్లాడుతూ యూరియాను అధికంగా వాడడంవలన పంటల్లో అధిక చీడపీడలు ఆశిస్తాయని తెలిపారు. తద్వార సస్యరక్షణ ఖర్చులు పెరిగి పెట్టుబడులు పెరిగి రాబడి తగ్గుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా 5 అంశాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ వివరించారు. అవసరం మేరకే రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని, విక్రయ కేంద్రాల్లోని రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందాలని సూచించారు. సాగునీటిని ఆదా చేసి, భావితరాలకు అందించాలని, పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం భువనగిరి మండల ఉద్యాన శాఖాధికారి మాధవి పండ్ల తోటలు , కురగాయలు, పూలతోటలు, పామాయిల్ సాగులో సబ్సిడీల గురించి, సాగు మెలకువలను తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బి. అనిల్ కుమార్, బి రాజా మధుశేఖర్, భూగర్భ నీటి విభాగం ఇంజనీర్ అశ్విత్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసన్న, మాజి సర్పంచ్ మల్లేశం, అభ్యుదయ రైతులు కంచి మల్లయ్య, సిద్ధా రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వాతి, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.