Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటెక్స్‌ టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టండి

టెక్స్‌ టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టండి

- Advertisement -

‘తైవాన్‌’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌ బాబు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో టెక్స్‌ టైల్‌ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయనీ, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్‌ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో తైవాన్‌ టెక్స్‌ టైల్‌ ఫెడరేషన్‌(టీటీఎఫ్‌) అధ్యక్షులు జస్టిన్‌ వాంగ్‌ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చర్చించింది.. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌(కేఎంటీపీ) గేమ్‌ ఛేంజర్‌గా మారనుందని ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. కేఎంటీపీలో జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, వీవింగ్‌, ప్రాసెసింగ్‌, గార్మెంటింగ్‌ అన్నీ ఒకే చోట పూర్తి చేసేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు. యంగాన్‌, కైటెక్స్‌, గణేషా ఎకోస్పియర్‌ మొదలగు టెక్స్‌ టైల్‌ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ”రవాణా సౌకర్యాలపరంగా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్‌, నాగ్‌ పూర్‌, విజయవాడ ఇండిస్టియల్‌ కారిడార్‌కు అనుసంధానంగా ఉంది. ఫంక్షనల్‌ టెక్స్‌ టైల్స్‌, ఎకో, డైయింగ్‌, రీసైక్లింగ్‌ తదితర అంశాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నారయని’ మంత్రి వారికి వివరించారు. కస్టమైజ్డ్‌ ల్యాండ్‌ పార్సిల్స్‌, ప్లగ్‌ అండ్‌ ప్లే యూనిట్లు, నైపుణ్య మానవ వనరులు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం, భౌగోళిక పరిస్థితులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమని అన్నారు. తైవాన్‌ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ‘తెలంగాణ తైవాన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌’ ప్రత్యేక టైక్స్‌ టైల్‌ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టెక్స్‌ టైల్‌ రంగం అభివృద్ధికి టీటీఎఫ్‌ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, రాష్ట్ర టైక్స్‌ టైల్స్‌ డైరెక్టర్‌ ధరణి, టీటీఎఫ్‌ సెక్షన్‌ చీఫ్‌ ఆర్థర్‌ చియాంగ్‌తో పాటు తైవాన్‌కు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇ-గవర్నెన్స్‌లో ఎస్తోనియా సహకారం
ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ రంగంలో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ‘ఎస్తోనియా’ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు. రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ప్రశంసించారు. శుక్రవారం ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్‌ ఆధ్వర్యంలో తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్లో తెలంగాణ ఇంకా ప్రథమ దశలోనే ఉందనీ, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్‌ బాబు కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్‌ కీలకమని పేర్కొన్నారు. సెప్టెంబరులో తమ దేశం సందంర్షించాలని మ్యారియే లూప్‌ చేసిన అభ్యర్థనకు మంత్రి సానుకూలంగా స్పందించారు. తమ అధికారుల బృందం ఎస్తోనియాలో పర్యటిస్తుందనీ, విద్య, ఇ గవర్నెన్స్‌, ఏఐ, రోబోటిక్స్‌లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -