– సుప్రీం కోర్టు ఆదేశం
– చట్టవిరుద్దమని ఫిర్యాదు చేసిన వన్యప్రాణి హక్కుల సంస్థలు
న్యూఢిల్లీ : రిలయెన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబాని కుమారుడు అనంత్ అంబానీ నిర్వహిస్తున్న ప్రయివేటు జూ పై విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. చట్టవిరుద్దంగా జంతు జాతులను సమీకరిస్తున్నారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని వన్యప్రాణి హక్కుల సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఫిర్యాదును స్వీకరించి విచారించిన ధర్మాసనం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేసి దర్యాప్తు చేయాలని, సెప్టెంబర్ 12 లోపు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ గుజరాత్ జామ్‌నగర్‌లో అనంత అంబాని నేతృత్వంలో రిలయెన్స్ ఫౌడేషన్ జూ (వంతారా )ను నిర్వహిస్తుంది. 998 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా లక్షా 50 వేలకు పైగా జంతువులున్నాయని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రమని వంతారా ప్రచారం చేస్తుంది. ఈ జూలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, చట్ట విరుద్దంగా అంతరించిపోతున్న జంతు జాతులను సమీకరిస్తున్నారని వన్య ప్రాణి సంరక్షణ, జంతు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. జంతువుల రక్షణ, పునరావాసం, వాటి సంరక్షణపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ జూ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, డబ్బుతో అన్నీ కొనలేరని ఆ సంస్థలు తెలిపాయి. దీనిపై వంతారా జూ అధికారులు స్పందిస్తూ ఎటువంటి పొరపాట్లు జరగలేదని, విచారణకు సహకరిస్తామని అన్నారు. గత సంవత్సరం వేల కోట్లు ఖర్చు చేసి 7 రోజుల పాటు అనంత అంబాని పెళ్లి వేడుకలు జరిపిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి సందర్భంగా ప్రపంచ ప్రముఖులు వంతారా ( జూ )ను సందర్శించారు. అతిధులకు విలాస కేంద్రంగా జంతు సంరక్షణ కేంద్రాన్ని మార్చేశారని పలువురు విమర్శిస్తున్నారు. మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోడి జూ ను సందర్శించి ప్రశంసించడం గమనార్హం.
అనంత్ అంబానీ ప్రయివేటు జూ పై విచారణ
- Advertisement -
- Advertisement -