ఐపీఎల్‌ పండుగొచ్చె!

IPL2025– నేటి నుంచి ఐపీఎల్‌18 ఆరంభం
– తొలి మ్యాచ్‌లో కోల్‌కత, బెంగళూర్‌ ఢీ
– రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
17 వసంతాలుగా అభిమానులకు వేసవి వినోదం అందిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ సీజన్‌కు ముస్తాబైంది. ప్రపంచ క్రికెట్‌ను ప్రాంఛైజీ ఫార్ములాకు విజయవంతంగా పట్టాలెక్కించిన ఐపీఎల్‌.. లీగ్‌ బ్రాండ్‌తో పాటు ఆటగాళ్ల పాపులారిటిని సైతం గణనీయంగా ప్రభావితం చేసింది. అభిమానులు, మార్కెట్‌ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ పండుగ వచ్చేసింది. 2008 అరంగేట్ర ఐపీఎల్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లో తలపడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌.. మళ్లీ ఐపీఎల్‌లో ఓ సీజన్‌ తొలి మ్యాచ్‌లో సమరానికి సై అంటున్నారు. ఈడెన్‌లో నేడు ఆర్సీబీ, కెకెఆర్‌ పోరుతో ఐపీఎల్‌18 షురూ కానుంది.
నవతెలంగాణ-కోల్‌కత
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పండుగొచ్చింది. ఐసీసీ ఈవెంట్లలో వరుస టైటిల్స్‌తో భారత అభిమానులను మంత్రముగ్ధులు చేసిన మన క్రికెటర్లు… ఇప్పుడు ఐపీఎల్‌ హంగామాతో ఆ జోష్‌ను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్‌ 18వ సీజన్‌ నేడు ఈడెన్‌ గార్డెన్స్‌లో షురూ కానుంది. ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ తలపడనున్నాయి. ఆటగాళ్ల మెగా వేలంతో అన్ని జట్లు సరికొత్తగా కనిపిస్తుండగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కత నైట్‌రైడర్స్‌ నాల్గో టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగుతుండగా.. తొలి టైటిల్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ పోరాటానికి సై అంటోంది.
స్పిన్‌ సవాల్‌!
ఐపీఎల్‌18 సీజన్‌లో నేడు తొలి మ్యాచ్‌. ఆటగాళ్ల మెగా వేలం, జట్టు సమీకరణాల్లో మార్పులు.. సారథ్య బాధ్యతల్లో కొత్త రక్తం వెరసి నేడు నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అజింక్య రహానె కోల్‌కతకు కెప్టెన్‌గా వ్యవహరించనుడగా.. రజత్‌ పాటిదార్‌ బెంగళూర్‌కు సారథ్యం వహిస్తున్నాడు. ఓపెనింగ్‌, మిడిల్‌ ఆర్డర్‌ సహా బౌలర్ల కూర్పుపై ఆసక్తి కనిపిస్తోంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ మరోసారి థ్రిల్లింగ్‌ ముగింపులను అందించేందుకు ఎదురుచూస్తోంది.
కోల్‌కత నైట్‌రైడర్స్‌ అనగానే అండ్రీ రసెల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో పాటు సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌ మాయజాలం గుర్తుకొస్తాయి. మరోవైపు బెంగళూర్‌ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి స్పిన్‌ బలహీనతను ఎదుర్కొంటున్నాడు. ఈడెన్‌లో కోహ్లి క్రీజులోకి రాగానే రహానె వెంటనే నరైన్‌, వరుణ్‌కు చేతికి బంతి అందిస్తాడనటంలో సందేహం లేదు. తొలి మ్యాచ్‌లో ఇరు జట్ల విదేశీ ఆటగాళ్ల ఎంపికపై ఫోకస్‌ కనిపిస్తోంది.
ఆరంభ వేడుకకు ఏర్పాట్లు
ఐపీఎల్‌ ఆరంభ వేడుకలకు ప్రత్యేకత ఉంది. ప్రతి సీజన్‌కు నిర్వాహకులు అభిమానులను మరింతగా అలరించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్‌ నటీ దిశా పటాని నృత్య ప్రదర్శన హైలైట్‌గా నిలువనుంది. శ్రేయ ఘోషల్‌, కరణ్‌ అహుజా ఆట పాటలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 35 నిమిషాల పాటు ఓపెనింగ్‌ సెర్మానీ వేడుక సాగనుంది. మ్యాచ్‌ టాస్‌ 7 గంటలకు పడనుండగా.. ఓ 60 నిమిషాల ముందే ఆరంభ వేడుకలు ఆరంభం కానున్నాయి.
వర్షం ముప్పు
ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ ‘ఆరెంజ్‌’ హెచ్చరిక జారీ చేయగా.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం మెండుగా ఉంది. కోల్‌కతలో బుధవారం, గురువారం సైతం వర్షం కురిసినా.. ఇరు జట్లు ప్రాక్టీస్‌ చేశాయి. శుక్రవారం రాత్రి సైతం ఈడెన్‌గార్డెన్స్‌లో వర్షం కురిసింది. మైదాన సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలిగితే.. ఆఖరుకు ఐదు ఓవర్ల మ్యాచ్‌ సాధ్యపడేందుకు వీలుగా నిబంధనలు ఉన్నాయి. వర్షంతో మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లు చెరో పాయింట్‌ పంచుకోనున్నాయి.

Spread the love