నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. శనివారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్న వీడియోను స్థానిక మీడియా ప్రదర్శించింది. ఖమేనీ ఈ కార్యక్రమానికి హాజరుకాగానే అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి.. ఆయనకు మద్దతుగా పిడికిలి బిగించి, నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరిట ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇటీవల దాడులు చేసిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల రీత్యా ఇన్ని రోజులు ఆయన రహస్య బంకర్‌లో ఆశ్రయం పొందారు. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండటానికి ఖమేనీ ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అత్యంత రహస్య, ఉన్నతస్థాయి విభాగం ఆయనకు భద్రత కల్పించింది. చివరిసారిగా ఇరాన్ సుప్రీంనేత ఈ నెల 11న సైనిక కమాండర్ల సమావేశంలో కనిపించారు.