నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌తో వాణిజ్యం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంపై తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా తన మోసపూరిత చర్యలను, నమ్మక ద్రోహులైన కిరాయి వ్యక్తులపై ఆధారపడటాన్ని తక్షణమే నిలిపి వేయాలని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఖమేనీ ఓ పోస్టు పెట్టారు.
‘ఇరాన్ శత్రువులకు భయపడదు. ఈ విషయాన్ని చాలా సార్లు చాటిచెప్పాం. ఇప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు మోసపూరిత చర్యలను తక్షణమే ఆపేయాలి. మా దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి వ్యక్తులపై ఆధారపడటాన్ని ఆపేయాలని హెచ్చరిస్తున్నాం. ఇరాన్ బలమైన, శక్తిమంతమైన దేశం. ఇరాన్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వారికి శత్రువు ఎవరో తెలుసు. వారిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని ఖమేనీ హెచ్చరించారు.



