– మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఐద్వా
న్యూఢిల్లీ: ఆర్మీ సీనియర్ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజరు షా చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి వ్యాఖ్యలు అత్యంత బాధ్యాత రాహిత్యం, జుగుప్సాకరమని ప్రకటనలో విమర్శించింది. మంత్రి చేసిన మతతత్వ వ్యాఖ్యలనూ ఖండించింది. గత మూడు తరాల నుంచి ఆమె కుటుంబం సేవలందిస్తుందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ యొక్క ప్రముఖ వ్యక్తిపై మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా పక్షపాతంతో కూడినవని, ఈ వ్యాఖ్యలు సిగ్గు చేటు మాత్రమే కాదని, సైన్యం, మహిళలకు ఇద్దరికీ అవమానకరమని విమర్శించింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఒక మంత్రి ఇలాంటి స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలు చేయడం సిగ్గుచేటని పేర్కొంది. ఒక ఆర్మీ అధికారిని లేదా సైనికుడిన్ని హిందూ లేదా ముస్లింగా మతపరమైన కళ్ళజోడుతో చూడలేమని తెలిపింది. మంత్రి చేసిన ఈ రకమైన విభజన వ్యాఖ్యలు ముస్లింలపై మతపరమైన ద్వేషం ఆధారంగా ముస్లింలందర్నీ ఉగ్రవాదులుగా చూసే బిజెపి హిందూత్వ భావజాలపు మూలాలను వెల్లడిస్తుందని ఐద్వా పేర్కొంది. మంత్రి వ్యాఖ్యలు బిజిపి యొక్క ప్రమాదకరమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించింది. అలాగే మంత్రి వ్యాఖ్యలు ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రస్తుతం నిలకడగా ఉన్న వాతావరాణాన్ని కలుషితం చేసే ప్రయత్నం కూడా అని విమర్శించింది.తన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన తరువాత మంత్రి విజరు షా క్షమాపణలు చెప్పడం, వివరణ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని ఐద్వా తెలిపింది. అధికార బిజెపి దీనికి బాధ్యత వహించాలని తెలిపింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇటువంటి పక్షపాత, తిరోగమన ఆలోచనలను ప్రచారం చేసినందుకు మంత్రిని తక్షణమే రాజీనామా చేయాలని కోరాలని బిజెపిని ఐద్వా డిమాండ్ చేసింది.
బాధ్యతారాహిత్యం, జుగుప్సాకరం
- Advertisement -
- Advertisement -