Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపోరాటాలపై నిర్బంధమే ప్రజాపాలనా?

పోరాటాలపై నిర్బంధమే ప్రజాపాలనా?

- Advertisement -

– అనుమతి ఇచ్చేనట్టే ఇచ్చి అర్థరాత్రి రద్దు చేయడమేంటి?
– గత ప్రభుత్వ ఒరవడిలో.. ఇప్పుడూ గృహ నిర్బంధాలు, అరెస్టులు
– కాంగ్రెస్‌ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి : సీఐటీయూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు శాంతియుతంగా నిరసన తెలియజేయటం నేరమా? ఎన్నికల సమయంలో మీరిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటే..అది శాంతిభద్రతల సమస్య అవుతుందా?మా నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకుంటే..లిఖిత పూర్వక పర్మిషన్‌ ఇవ్వకుండా ..మౌఖికంగా అనుమతిచ్చినట్టే ఇచ్చి, సీఐటీయూ నాయకులను, సంఘం నేతలను గృహ నిర్బంధంలో ఉంచటం, పర్మిషన్‌ ఉంది కదా అని జిల్లాలనుంచి తరలివచ్చిన కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం ప్రజాపాలనలో భాగమా?’ అంటూ సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, కార్యదర్శి జె వెంకటేశ్‌, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్‌, యాటల సోమన్న పాల్గొన్నారు.
భాస్కర్‌ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను, కార్మిక పోరాటాలను పోలీసు నిర్బంధం ద్వారా అణచివేయాలని చూస్తే..ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్‌ సర్కార్‌ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని కొనసాగించిందనీ, తద్వారా కార్మికుల, రైతుల, కూలీల, ఉద్యోగుల అసంతృప్తికి గురై అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముందు ధర్నా కార్యక్రమానికి ఆ సంఘం పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. అయితే పోలీసులు …కార్మికులను ఎక్కిడికక్కడ అరెస్టులు చేసి, నాయకులను గృహనిర్బంధంలో ఉంచటం ప్రజాపాలన లక్ష్యమా? అని ప్రశ్నించారు. దీంతో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఏడో గ్యారెంటీగా ఉంటుందనే వాగ్దానం ఉత్తుత్తిదే అని తేలిపోయిందని విమర్శించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, ఆశా, అంగన్‌వాడీ తదితర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సేవలందిస్తున్న స్కీమ్‌ వర్కర్లపై పోలీసు నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రభుత్వం అభాసుపాలు కాక తప్పదని చెప్పారు. కార్మికుల పోరాటాలే ఉండొద్దను కుంటే..వారికిచ్చిన వాగ్దానాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన ధర్నాను పోలీసులు భగం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సర్కార్‌ తీరు మారాలన్నారు. ప్రభుత్వానికి తమ పోరాటాలే తగిన సమయంలో సరైన సమాధానం చెపుతాయని హెచ్చరించారు.
ఎస్వీ రమ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. ఐదు నెల్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతున్నారని గుర్తు చేశారు. రూ. పదివేల వేతనాన్ని పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని అడగటం నేరమెలా అవుతుంది? గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తే..మీరిచ్చిన హామీలు పక్కకు పోతాయా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వారికి రెగ్యులర్‌గా గ్రీన్‌ చానల్‌ ద్వారా జీతాలివ్వాలని డిమాండ్‌ చేశారు. జె వెంకటేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యం సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, నగరంలో రకరకాల నేరాలు జరుగుతున్నాయనీ, వాటిని అరికట్టలేని పోలీసు యంత్రాంగం కార్మికుల పోరాటాలను అణిచేందుకు ఉత్సాహం చూపుతోందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీఎన్‌స్‌ చట్టాన్ని రాష్ట్రంలో పరోక్షంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. వంగూరు రాములు మాట్లాడుతూ గత ప్రభుత్వం తోవలోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే..పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. నిర్బంధ విధానాన్ని విడనాడాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img