– బంగ్లాదేశ్ ఇమ్మిగ్రెంట్ల గుర్తింపు ప్రక్రియపై అమిత్ షాకు సీపీఐ(ఎం) నేతల లేఖ
– దేశ రాజధానిలో మానవ హక్కుల ఉల్లంఘనలు, వేధింపులు, బలవంతపు వసూళ్లు
– బెంగాలీ ముస్లింలందరూ నేరస్తులేనా ?
న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్లను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థలు అమలు చేస్తున్న ప్రక్రియలో మానవ హక్కులు దారుణంగా ఉల్లంఘించబడుతున్నాయని, వేధింపులు, బలవంతపు వసూళ్ళు వంటివి చోటు చేసుకుంటున్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలు, మాజీ ఎంపీ బృందా కరత్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, ఢిల్లీ శాఖ కార్యదర్శి అనురాగ్ సక్సేనా విమర్శించారు. ఈ మేరకు వారు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు.
కేవలం బెంగాలీ మాట్లాడుతున్నారనే కారణంతో నిజమైన భారతీయ పౌరులను వేధింపులకు గురి చేస్తున్నట్లు తమకు అనేక ఫిర్యాదులు వచ్చాయని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన సీపీఐ(ఎం) నేతల బృందంతో కలిసి ఈనెల 10న తాము ఢిల్లీలోని భావనా జెజె కాలనీ సందర్శించామని, అక్కడ అనేకమంది ఫిర్యాదీదారులను కలిసి మాట్లాడామని చెప్పారు. అత్యంత దారుణమైన రీతిలో కనీస మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులను చూసి దిగ్భ్రాంతి చెందామన్నారు. కొన్ని కేసుల్లో అయితే అవినితి కూడా చోటు చేసుకుంటోందని, బలవంతంగా వసూళ్ళకు పాల్పడుతున్నారని పేర్కొంటూ కొన్ని ఉదాహరణలను ఆ లేఖలో వివరించారు.
8 చాలా దశాబ్దాల క్రితమే మహ్మద్ నిజాముద్దీన్ జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా నుంచి ఢిల్లీకి వలస వచ్చేశారు. ఆ భార్యాభర్తలిద్దరికీ జార్ఖండ్‌లో ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు వున్నారు. 2004లో భావనా జెజె కాలనీలో ఆయనకు ఒక స్థలం కేటాయించబడింది. ప్రస్తుతం అక్కడే వుంటున్నారు. జులై 5న స్థానిక పోలీసు బృందం వారి ఇంటికి వెళ్ళి అక్రమ కాగితాలు సంపాదించుకునేందుకు ఒక బంగ్లాదేశ్ జాతీయుడికి సాయం చేస్తున్నారంటూ ఆరోపించింది. తన ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తి మూడేళ్ళ నుంచి వుంటున్నాడని, ఆ వ్యక్తి ఎక్కడివాడో ఏమిటో తనకు వివరాలేమీ తెలియదని నిజాముద్దీన్ పోలీసులకు చెప్పారు. జులై 6న ఉదయం ఆరు గంటలకే వచ్చిన పోలీసులు నిజాముద్దీన్‌కు బేడీలు వేసి అందరూ చూస్తుండగానే కరడుగట్టిన నేరస్తుడిలా పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్ళారు. ఈసారి ఆయననే బంగ్లాదేశీయుడు అంటూ పోలీసులు వ్యాఖ్యలు చేశారు. వెంట వెళ్ళిన ఆయన కుమార్తె షబ్నం జార్ఖండ్‌లో తమకు గల ఆస్తితో సహా అన్ని పత్రాలు సమర్పించింది. అయినా, పోలీసులు నిజాముద్దీన్‌పై చేయి చేసుకుంటూ అసభ్య పదజాలంతో తిడుతూ బంగ్లాదేశీయుడికి ఆశ్రయమిచ్చానని ఒప్పుకోవాలని లేదా ఆయననే బంగ్లాదేశీయుడిగా ప్రకటిస్తామని అన్నారు. పిల్లలతో సహా మొత్తంగా కుటుంబ సభ్యులందరినీ పోలీసులు పట్టుకెళ్ళారు.
అందరినీ తిడుతునే వున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో వారిని విడుదల చేశారు. మళ్ళీ 8వ తేదీ పొద్దునే వారిని మరో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. అక్కడా మళ్ళీ వేధించారు. యువతులతో సహా అందరినీ పదే పదే ఫోటోలు తీశారు. ఆ సమయంలో సీనియర్ పోలీసు అధికారులెవరూ లేరు, కేవలం జూనియర్లు మాత్రమే వున్నారు. కొంత సమయం తర్వాత వారిని వదిలిపెట్టారు. ఇలా తర్వాత కొద్ది రోజుల పాటు వేర్వేరు పోలీసు స్టేషన్ల నుంచి వచ్చిన పోలీసు బృందాలు వారి ఇంటికి వెళ్లడం పత్రాలు చూపించాలని కోరడం జరిగింది. పోలీసు సైట్‌లో వారి ఫోటోలు అప్‌లోడ్ చేశామని, పోలీసు విచారణలు వుంటాయని చెప్పారు. చట్టానికి కట్టుబడిన భారత దేశ పౌరులను వేధిస్తున్న పోలీసుల చట్టవిర్ధుమైన ప్రవర్తనకు ఇది స్పష్టమైన ఉ దాహరణ అని బృందాకరత్ ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అన్నిసార్లు వారి ఇంటికి వెళ్ళేసరికి వారి కుటుంబ గౌరవం దెబ్బతిందని అన్నారు. పోలీసు రికార్డుల్లో నుండి వారి ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. నిజాముద్దీన్‌పై చేయి చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 8.భావనా సి బ్లాక్‌లో జుగ్గి సెటిల్‌మెంట్‌లో నివసిస్తున్న సాజన్ సౌదాగర్‌ను మే 6న పోలీసులు పట్టుకెళ్ళారు. ప్రీతంపురా థానాకు తీసుకెళ్ళారు. బంగ్లాదేశీయుడినని ఒప్పుకోవాలంటూ ఇద్దరు పోలీసులు ఆయనను చితకబాదారు. ఆయన వద్దని వేడుకుంటున్న కొద్దీ వారు లాఠీలతో బాదారు. నేలపై పడేశారు. బూట్లతో చెవులపై తన్నారు. సాజన్ చెవి ఒకటి బాగా దెబ్బతింది. మరో పోలీసు ఆయన మొబైల్‌ను చెక్ చేశారు. తర్వాత పొరపాటున తీసుకున్నానని చెప్పాడు. బెంగాలీ మాట్లాడుతున్నారని తమకు సమాచారం అందిందని, అందుకే తీసుకువచ్చామని వారు తర్వాత చెప్పారు.
మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ.
8 60, 70ఏండ్ల వయస్సులోని ముగ్గురు మహిళలతో మాట్లాడాం. దశాబ్దాల క్రితం పిల్లలుగా వున్నపుడు వారిని, వారి తల్లిదండ్రులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. వారి తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. ఈ మహిళలు భారత్‌లోనే పెండ్లిండ్లు చేసుకున్నారు. వారి పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, వారికి ఇక్కడే కుటుంబాలు కూడా వున్నాయి. ఆ ముగ్గురు మహిళలు వితంతువులు. ఇప్పుడు వారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్ళి మూడు రోజులు పూర్తిగా అక్కడే వుంచారు. వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లాక్కున్నారు. ఆర్‌కె పురంలో పోలీసు అధికారి ముందు వారిని ప్రవేశపెట్టగా, వారి బయోమెట్రిక్‌లు తీసుకుని, వెనక్కి పంపించారు. ఇక్కడ కూడా వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసుల బృందం వారి ఇండ్లకు వెళ్ళి వారిని ప్రశ్నించింది.
దశాబ్దాలుగా భారత్‌లో జీవిస్తున్న వారికి బంగ్లాదేశ్‌లో ఎవరూ లేరు. వారి పిల్లలు పుట్టుకతో భారత పౌరులు. ఏ క్షణంలోనైనా తమను బలవంతంగా తరలించేయవచ్చన్న భయంతో వారు ప్రతి రోజూ బతుకుతున్నారని సీపీఐ(ఎం) నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు. నిరుపేదలైన, ఒంటరి మహిళల పట్ల ఇటువంటి ప్రవర్తన అమానవీయమైనది, అన్యాయమైనది.
8 ఢిల్లీలో ఇతర చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు చాలా వున్నాయి. ఉదాహరణకు మేలో చాణక్యపురిలో నివసిస్తున్న బెంగాలీల ఐడి పేపర్లను పోలీసులు తీసుకెళ్ళిపోయారు. అవి వెనక్కి ఇవ్వాలంటే డబ్బులివ్వాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది సామాజిక కార్యకర్తలు దీనిపై పోలీసులను కలిసి ప్రశ్నించగా, తాము అలాంటి ఆదేశాలివ్వలేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తర్వాత ఆ పత్రాలను వెనక్కి ఇచ్చారు. ఆ తర్వాత మరో రెండు సంఘటనల్లో క్రైం బ్రాంచ్ సిబ్బంది ఇద్దరు పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారు బెంగాలీ ముస్లింలు, వారిని రోజంతా కస్టడీలో వుంచారు. పశ్చిమ బెంగాల్‌లో పుట్టినట్లు, అక్కడ ఇల్లు వున్నట్లు రుజువులు, సాక్ష్యాధారాలు వున్నా వారిని వేధించారు. జూన్ 24న ఈ సంఘటన జరిగింది.
8 జూన్ 26న నివ్వెరపోయే మరో సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో నివసిస్తూ పని చేసుకుంటున్న 8మంది బెంగాలీ వలస కార్మికులను బలవంతంగా బంగ్లాదేశ్‌కు పంపేశారు. బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లాలోని పైకా గ్రామంలో తమకు ఇల్లు వుందని రుజువు చూపించినా వారిని వదిలిపెట్టలేదు.
ఇలా పంపిన వారిలో ఒక మహిళ, ఐదేండ్ల బాలుడు వున్నారు. బంగ్లాదేశ్‌లో వారి పరిస్థితి ఏమిటి? పైకా గ్రామంలోని వారి కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధానిలో బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులను గుర్తించే పేరుతో సాగించే ఈ ప్రక్రియ కనీస మానవ హక్కుల ఉల్లంఘనకు ఉదాహరణగా వుంది. ఈ క్రమంలో నిజమైన భారత పౌరులు వారి భాష, మతం ప్రాతిపదికన లక్ష్యాలుగా మారుతున్నారు. బెంగాలీ మాట్లాడడం భారతదేశంలో ఇప్పుడు నేరమా? పైగా బెంగాలీ మాట్లాడే ముస్లిం పౌరులందరినీ నేరస్తులుగా, అక్రమ వలసదారులుగా చూస్తారా? పశ్చిమ బెంగాల్‌లో 26శాతంమంది జనాభా బెంగాలీ మాట్లాడే ముస్లింలేనని ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నామని బృందా కరత్, అనురాగ్ సక్సేనాలు ఆ లేఖలో పేర్కొన్నారు. పైగా, అక్రమ వలసదారులను తరలించేందుకు కూడా అంతర్జాతీ యంగా కొన్నినిబంధనలు, ప్రమాణాలు వుంటాయి. కానీ ఢిల్లీలో ప్రస్తుతం అనుసరిస్తున్న గుర్తింపు పద్దతులు అటువంటి నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తు న్నాయి. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ పరిశీలించి, మానవ హక్కులను పునరుద్ధరించడానికి, అలాగే లా ఎన్‌ఫోర్స్ మెంట్ సంస్థల మానవీయ వైఖరిని పునరుద్ధరిం చడానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయిన బాధితులకు తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాల్సిందిగా వారు ఆ లేఖలో హోం మంత్రి అమిత్ షాను కోరారు.