Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeమానవిఒత్తిడికి దూరంగా ఉండ‌టం సాధ్య‌మేనా?

ఒత్తిడికి దూరంగా ఉండ‌టం సాధ్య‌మేనా?

- Advertisement -

చిన్న- పెద్ద, ఆడ-మగ, విద్యాధికులు-పామరులు, నిరుపేదలు-సంపన్నులు, కుల-మత వ్యత్యాసాలకతీతంగా, ఎటువంటి తారతమ్యాలు చూపించకుండా అందరినీ నిర్వీర్య పరిచేది ఒత్తిడి. ప్రవృత్తికనుగుణంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే మానసిక స్థితి. కొందరు రోజువారీగా, కొత్తగా వారికి అలవాటులేని ఏ చిన్న పని చేయవలసి వచ్చినా, మరికొందరు కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విషయాలకి మాత్రమే ఒత్తిడికి లోనౌతారు. అందరమూ ఎదో ఒక రూపంలో ఒత్తిడికి గురి అవుతూనే ఉంటాము కాబట్టి, ఒత్తిడిని అనుభవ పూర్వకంగా తెలుసుకోని వాళ్లుండరనడం అతిశయోక్తి కాదేమో! అందునా మహిళలకు ఈ సమస్య మరింత ఎక్కువ. మరి దీని నుండి బయటపడటం ఎలాగో ఈ రోజు మానవిలో తెలుసుకుందాం…

ఒత్తిడి, మనమేదైతే పరిస్థితిని ఎదుర్కుంటున్నామో అది శరీరం తట్టుకొనే పద్ధతిలో లేదు అని, దానికి ప్రత్నామ్యాలు వెతకవలసిన అవసరం ఉందని తెలిపే ఒక మహత్తర సూచిక. శరీరాన్ని క్లిష్ట పరిస్థితి నుండి కాపాడుకొనే ఒక విధానం. ఒక వ్యక్తి ఎదుర్కుంటున్న పరిస్థితి, ఆ వ్యక్తి సంభావ్యత పరిధిలో ఉన్నదీ, లేనిదీ తెలిపే దిక్సూచి. సాంకేతిక పరిభాషలో ఒత్తిడిని జీవన శైలి లేదా పరిస్థితుల మార్పు వలన కలిగే శారీరిక, మానసిక అసుంతలతగా వర్ణిస్తారు. సాధారణంగా ఒత్తిడి, కారకాలను బట్టి, స్వల్ప కాలిక-మంద్ర స్థాయి, స్వల్ప కాలిక-తీవ్ర స్థాయి, దీర్ఘ కాలిక-మంద్ర స్థాయి, దీర్ఘ కాలిక- తీవ్ర స్థాయి, అప్పుడప్పుడు మంద్ర స్థాయి-తీవ్ర స్థాయి ఇలా రకరకాలుగా వ్యక్తం కావచ్చు.
ఒత్తిడికి కారకాలు
ఎప్పటికప్పుడు ఉద్భవించే సవాళ్లు, వృత్తి, ఆర్థిక, సాంఘిక-స్నేహ-సంబంధ పరమైన బాధ్యతలు, అవసరాలు, చదువు, జీవితాశయాలు, ఆదర్శాలు, వాటివల్ల వచ్చే వివాదాలు, సంఘర్షణలు, వాతావరణ-దేశ-ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో బాహ్య కారకాలు ఒత్తిడికి దారి తీస్తాయి. అప్పుడప్పుడు కొందరిలో దైనందిన పనులు, కొత్తవారిని కలవడం, తెలిసిన వ్యక్తులైనా, వారిని కలవడం ఇష్టపడకపోవడం వంటివి కూడా ఒత్తిడిని తీసుకొస్తాయి. మాములు పరిస్థితుల్లో ఇటువంటి కారకాలు స్వల్ప కాలిక ఒత్తిడిని కలిగిస్తాయి. కానీ ఇవే తీవ్ర రూపం దాల్చి లేదా ఇలాంటివే మరికొన్ని కూడి, దీర్ఘకాలిక ఒత్తిడిగా మారినప్పుడు దుష్ప్రభావాలు కలగవచ్చు. చేయవల్సిన పనులు సమర్థవంతంగా చేయలేకపోయినందున వారిలో ఆత్మ న్యూనత, నిరాశ వంటివి పెరిగి తీవ్రమైన కోపం, ప్రతికూల ప్రవర్తనకి లోనౌతారు. ఇలా కొంత కాలానికి వారి స్వాభావిక వ్యక్తిత్వం మార్పు చెంది, ఆందోళన, ఆత్రుత, ఆరాటంతో కూడిన మానసిక రుగ్మతకు గురౌతారు. ఈ విధంగా ఇవి ఒత్తిడి తీవ్రతను పెంచే అంతర్గత కారకాలుగా పనిచేస్తాయి. శాస్త్రీయంగా, ఒత్తిడికి జన్యుపరమైన కారకాలేవి ఇప్పటివరకు తేలనప్పటికీ, పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావం కొంత కారకం కావడానికి ఆస్కారముందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలు అనేక కారణాలతో తొందరగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. కానీ వారిలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగు మోతాదులో ఉంటే ఆ ఒత్తిడి ప్రభావం పెద్దగా కనిపించదు.
శరీరం స్పందన, ఒత్తిడి లక్షణాలు
శరీరం ఏ మాత్రం ఒత్తిడికి గురైనా వెంటనే ఆడ్రెనాలిన్‌ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. దాని ప్రభావానికి ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, జీర్ణ కోశం, మెదడు, రోగనిరోధక యంత్రాంగం, కండరాలు స్పందిస్తాయి. విపరీతమైన కోపం, అసహనం, తలనొప్పి, అరచేతుల్లో చెమటలు, తలతిరగడం, ఆయాసం, నిద్రలేమి, గుండెదడ-మంట, అధిక రక్త పోటు, వెన్నుపోటు, ఆహారం తీసుకున్న వెంటనే విరేచనాలు, వాంతులు, ఆకలి లేకపోవటం, మలబద్దకం, కండరాల ఉద్రిక్తత, ఎముకల్లో, కీళ్ళల్లో నొప్పులు వంటి రకరకాల శారీరిక, మానసిక సమస్యలు ఉత్పన్నమవ్వవచ్చు. సాధారణంగా స్త్రీలు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఉద్యోగం, ఆర్థిక పరమైన బాధ్యతల్ని పురుషలకన్నా సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటారు. వీటితో బాటు రోజువారిగా వచ్చే ఇబ్బందుల్ని, తద్వారా కలిగే తాత్కాలిక ఒత్తిడిని ఐదు పదుల వయసు వరకు ఓర్చుకునేందుకు ఇస్ట్రోజెన్‌ హార్మోను తోడ్పతుంది. కానీ రుతువిరతి (మెనోపాస్‌)తో ఈ హార్మోన్‌ తగ్గిపోతుంది. కనుక ఒత్తిడి తీవ్రత పోస్ట్‌ మెనోపాసల్‌ స్త్రీలలో ఎక్కువగా కనపడే ప్రమాదమున్నది.
ఒత్తిడి నివారణ సాధ్యమేనా?
‘సాధనమ్మున పనులు సమకూరు ధరలోన’ అనుకుంటే సాధ్యమే. కానీ కొందరు, ముఖ్యంగా మహిళలు బహుళ విధుల్ని
సమర్థవంతంగా నిర్వర్తించాలనే ఆలోచనతో ఎవరి ప్రమేయం, సహకారం తీసుకోకుండా ఎన్నో బరువుబాధ్యతల్ని తమ భుజాలపై వేసుకొంటారు. ఈ విధంగా చూస్తే ఒత్తిడి కొంతవరకు మహిళల స్వయంకృతం. ఏ పనైనా మొదలుపెట్టే ముందు ఆ పని పట్ల అవగాహన చాలా అవసరం. ప్రశాంత చిత్తంతో, పనిని ఏ విధంగా చేస్తే సఫలత దొరుకుతుందో అనే దిశగా ఆలోచించి, ప్రణాళికను తయారుచేసుకొని, క్రమబద్ధతతో ఆచరణలో పెడితే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆ పనికి కావాల్సిన సామర్థ్యం, బలహీనతలు, అవకాశాలు, అవరోధాల పట్ల అంచనా కలిగి ఉండడం చాలా అవసరం. అవి కొరపడినప్పుడు ఒత్తిడి తప్పదు, వైఫల్యాలూ తప్పవు. వైఫల్యాలతో మళ్ళీ ఒత్తిడి.. ఇలా ఒక విషవలయంలో చిక్కుకొనే ప్రమాదముంది. కాబట్టి లక్ష్యాలను ఎంచుకొనేటప్పుడు, నిష్పక్షపాతంగా పైన చెప్పబడిన అంశాలపై సమగ్ర అవగాహన కలిగి, స్వీయ ధ్రువీకరణతో కూడిన అప్రమత్తతతో వాటిని పాటిస్తే లక్ష్యాన్ని ఒత్తిడి లేని వాతావరణంలో సాధించవచ్చు. అప్రమత్తంగా ఉండడంలో కొంత ఒత్తిడి సహజంగానే ఉంటుంది. దీనిని ఆంగ్లంలో గుడ్‌స్ట్రెస్‌ అని అంటారు. కార్యసాధనకు సహకరించేది ఉపయోగకరమైనది. ఆలా సాధించినది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా ఇంకొందరికి మార్గదర్శకం అవుతుంది.
సాధ్యం కావట్లేదా..?
చాలా మంది ముఖ్యంగా స్త్రీలు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి త్వరిత ఉపశమనాల వైపు మొగ్గు చూపుతారు. నొప్పులకు ఓటిసి (ఓవర్‌ ది కౌంటర్‌) మందులు వాడుతుంటారు. అది ప్రమాదకరం కావచ్చు. వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. ఆత్మీయులతో, శ్రేయోభిలాషులతో, నమ్మశక్యులైన వారితో ఆందోళనలు పంచుకోవడం, అలా ఎవరూ లేని పక్షంలో విశ్వసనీయమైన, గోప్యతను కాపాడే కౌన్సిలింగ్‌ నిపుణుల ఆన్లైన్‌/ఆఫ్లైన్‌ వేదికలను సంప్రదించడం మంచిది. క్రమబద్ధమైన జీవన శైలి.. అంటే నడక పరుగు, ఆసనాలు, ప్రాణాయామము, యోగ వంటి శారీరిక, మానసిక వ్యాయామాలు చేస్తూ పౌష్టికాహారం, సరిపడు నిద్ర, మంచి అభిరుచులు, ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడతాయి.

  • డా||మీర
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad