Sunday, July 13, 2025
E-PAPER
Homeసోపతిఈదారెటు పోతుందో?

ఈదారెటు పోతుందో?

- Advertisement -

మనుషులు పీల్చేగాలిలో మార్పు వచ్చింది. తాగేనీళ్లల్లోనూ, నవిలే తిండిలోనూ మార్పువచ్చింది. మనకు కనపడదుకానీ భూమి తిరిగే పద్ధతీ మారిందేమో? మనుషుల్లో మార్పు ఎంత వేగవంతం అయిందంటే ఎప్పుడు ఎవడు ఎలా వుంటాడో ఎవరికీ అర్ధం అవదు.
అదో బెడ్రూం. బెడ్రూంలో మంచం కదా వుండాల్సింది. అది వుండాల్సిన చోటే వుంది. కాకపోతే ‘తల’ అది వుండాల్సిన చోట లేదు. తల లేకపోవడమంటే అస్సలు లేదని కాదుకానీ అది వుండాల్సిన చోట కాళ్లున్నవి. రాత్రి అటు వుండాల్సిన తల ఇటు ఎందుకు వచ్చిందీ, తలకిందులు ఎందుకు అయిందీ అర్థం కాలేదు ఆ తలకీ కాళ్లకీ స్వంత దారుడైనవాడికి. ఏదో జరిగింది. ఏదో జరుగుతున్నది. మెదడులో న్యూరాన్లు దారితప్పి తిరుగుతున్నవి. అనుకుంటున్నవాడి గదిలోకి వచ్చాడు తండ్రి.
‘ఏరా! ఇంత మొద్దునిద్ర! ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా’ అన్నాడు తండ్రి వాడ్ని కన్నోడు.
‘తెలీదు. నన్నెందుకడుగుతావు. గడియారాన్ని అడుగు’ అన్నాడు కొడుకు తల ఎగరేస్తూ.
తండ్రి వూహించని ఈ సమాధానానికి ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత అంతెత్తున ఎగిరిపడ్డాడు. ‘ఒళ్లు ఎలా వుంది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసేనా?’ అన్నాడు తండ్రి.
‘నువ్వెవరైతే నాకేంటి? ఈ ఇంటి వోనరువి. నీ భార్యకి మొగుడివి అంతే!’ అన్నాడు కొడుకు.
తండ్రి తల గిర్రున తిరిగింది. గిర్రున తిరిగిన తలలో వున్న కళ్లు కూడా గిర్రుగిర్రు తిరిగాయి. రాత్రి వీడిని ఏ దయ్యమో తన సొంతం చేసుకోలేదు కదా అనుకున్నాడు. ‘నేనురా! పూర్తిగా కళ్లు తెరిచి చూడు. నేను నీ తండ్రిని. నీకు జన్మనిచ్చినవాడిని’ అని తండ్రి అంటుంటేనే ఫక్కున నవ్వాడు కొడుకు.
‘అబ్బో జన్మనిచ్చాట్ట ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నావు. లోకంలో నువ్వు ఒక్కడివేనా తండ్రివి? రేపు నేనూ, ఆ తర్వాత నా కొడుకూ తండ్రి అవ్వడా? ఎవడికి ఎవడు ఏమైతేనేం, ఎవడి శరీరం వాడిదే, ఎవడి గాలి వాడు పీల్చాల్సిందే, ఎవడి బతుకు బరువు వాడు మొయ్యాల్సిందే. యుగాల నుంచీ రిపీట్‌ అయ్యేదే ఇదంతా. ఈ మాత్రానికి తండ్రీ తల్లీ, కొడుకు, అంకుల్‌, ఆంటీ, సిస్టర్‌, బ్రదర్‌.. ఓ… పేర్లు పెట్టుకుని ఒకళ్లనొకళ్లు అజమాయిషీ చేసుకోవడం అవసరమా? నీ అవసరానికి నేను, నా అవసరానికి నువ్వు అంతే. అంతకుమించి ఏమీ లేదు’ అన్నాడు పొగరుగా కాలరెగరేస్తూ కొడుకు.
‘నీకేమో అయిందిరా! వుండు మీ అమ్మను పిల్చుకువస్తా’ అంటూ దడదడమంటున్న గుండెను చేత్తో పట్టుకుని బయటకు పరుగెత్తాడు తండ్రి.
అదో ఇంటిముందు గేటు. గేటుదగ్గర ఆగింది ఓ బైక్‌. బైకుమాద ఇద్దరున్నారు. నడిపేవాడు నడపటం ఆపి వెనక భుజంమీదచేయి వేసుక్కూచున్న అమ్మాయి వైపు అనేకరాలుగా చూశాడు. అమ్మాయి చెంగున బైకు మీదినుంచి నేలకు దూకింది. అతని వైపు చూస్తూ అనేకరకాలుగా నవ్వింది. వీళ్ళిద్దరినీ గేటులోపల ఇంటి వరండాలో వున్న నాలుగు పదుల మీద ఐదో ఆరో ఏళ్లున్న ఆవిడ చూసింది. ఆమె ఒళ్లు సెగలు పొగలు అయింది.
బైకు అబ్బాయి ‘బై’ చెప్పి వెళ్లిపోయాడు. అమ్మాయి గాల్లో తేలుతూ ఇంట్లోకి పోబోయింది.
‘ఆగు. ఎవడే వాడు?ఎప్పట్నించే ఈ తిరుగుళ్లు?’ అంది ఆవిడ కొంగు బిగించి, ముక్కు ఎగరేస్తూ.
అమ్మాయి గాల్లో ఎగరటం మానేసి ఆగింది. తల దించుకుని చేతివేలుకి చున్నీ చుట్టుకుంటూ, తన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చిన ఆవిడ ముందు నిలబడలేదు. తల ఎగరేస్తూ ‘ఎవడైతే నీకేంటి? నా తిరుగుళ్లతో నీకు పనేంటి? అడగడానికి నువ్వెవరు?’ అంది.
ఆమె మొదట ఉలిక్కి పడ్డది. ఆ తర్వాత అంతెత్తున ఎగిరిపడ్డది. ‘ఒళ్లు ఎలా వుంది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసేనా?’ అన్నది.
‘ఆ తెల్సు. నువ్వో పెళ్లానివి. నీకో మొగుడు. మీ ఇద్దరికీ ఈ పాత కొంప. అనవసరంగా అథారిటీ చెలాయించకు’.
తల్లి తల గిర్రున తిరిగింది. గిర్రున తిరిగిన తలలో ఉన్న కళ్లు కూడా గిర్రుగిర్రు తిరిగాయి. ‘నేను నీ తల్లిని. నీకు జన్మనిచ్చినదాన్ని’ అని ఆ తల్లి అంటుంటేనే ఫక్కున నవ్వింది కూతురు. ‘అబ్బో ఇచ్చావులే జన్మ.! పెద్ద ఘనకార్యం చేశావు. లోకంలో నవ్వొక్కర్తివేనా తల్లివి. రేపు నేనూ ఆ తర్వాత నా కూతురూ తల్లి అవమా? ఈ మాత్రానికే కొంగు బిగించి యాగీ చేస్తావా? నీ బతుకేదో నువఉవ బతుకుతున్నావు కదా. నా బతుకు నన్ను బతకనీయ్యి. తల్లీతండ్రీ అక్కా బావా, మామ, చిన్నమ్మ, చిన్నాన్న అనీ అవసరాలకోసమే. ఎవరి అవసరాలు వావాళ్లవి. నా అవసరాలు నాకు తెల్సు. వాటి కోసం ఎవరికి వాళ్లు ఏదో ఒకటి చెయ్యాలి కదా అందా అమ్మయి ఇంట్లోకివెళ్తూ.
‘నీకేదో అయిందే. వుండు మీ నాన్న రానీ’ అంటూ కుర్చీలో కూలబడింది తల్లి.
ఈ ప్రపంచానికీ, మనుషులకీ నిజంగానే ఏదో అయ్యింది. కాలుష్యం శరీరాల్నే కాదు మనుషుల్నీ ఆక్రమిస్తున్నది. భర్త భార్యని ముప్పయి ముక్కలు చేస్తాడు. భార్య భర్త పీక మీద కాలేసి తొక్కుతుంది. కొడుకు తల్లి నాలుక కోస్తాడు. మనవడు అమ్మమ్మను గొడ్డలితో నరుకుతాడు. అయిదేళ్ల పాపను పిన్ని గొంతుకోసి బాత్‌రూంలో పడేస్తుంది. టీవీ సీరియళ్ల కుటుంబాలలో ఒకరిమీద ఒకరు పగబడ్తారు. ఒకరి నొకరు చంపుకోడానికి అనేక ఎత్తులు వేస్తారు. టీవీల్లోంచి పగబట్టే పడుచులు, ప్రాణాల్తీసే బద్మాష్‌లు ఇళ్లల్లోకి జొరబడుతున్నారు.
ఇళ్లల్లో, మనుషుల్లో, మనసుల్లో ఇంకేమేం మార్పులు వస్తాయో?!

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -