నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ దాడులు గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయని హమాస్ మండిపడింది. హమాస్ సీనియర్ కమాండర్ల హత్య, బెదిరింపులు లక్ష్యంగా ఇజ్రాయిల్ జరిపిన దాడి గాజా ఎన్‌క్లేవ్‌లో ‘ ఒప్పంద ఆచరణ సాధ్యత’కు ముప్పుగా మారిందని హమాస్ చీఫ్ రాయబారి ఖలీల్ అల్-హయ్యా ఆదివారం పేర్కొన్నారు. ఇజ్రాయిల్ శనివారం జరిపిన దాడిలో హమాస్ గ్రూప్ సీనియర్ కమాండర్ రయీద్ సయీద్ మరణించారని ఆయన ధృవీకరించారు. అక్టోబర్‌లో అమెరికా మద్దతుతో గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత హమాస్ సీనియర్ నేతపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడి, హత్య ఇదని పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరంతరం ఉల్లంఘించడం.. సయీద్, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఒప్పందం మనుగడకు ముప్పు కలిగిస్తున్నాయని టెలివిజన్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్ కాల్పుల విరమణను గౌరవించి, దానికి కట్టుబడి ఉండేలా చేయాలని మధ్యవర్తులు, ముఖ్యంగా ప్రధాన హామీదారు, అమెరికా యంత్రాంగం, అధ్యక్షుడు ట్రంప్‌కి సూచిస్తున్నామని అన్నారు. ఇజ్ ఎల్డీన్ అల్-హదద్ తర్వాత, తమ సాయుధ విభాగానికి సయీద్ రెండవ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారని హమాస్ వర్గాలు పేర్కొన్నాయి.



