Tuesday, April 29, 2025
Homeఅంతర్జాతీయంబీరుట్‌ శివార్లపై ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం

బీరుట్‌ శివార్లపై ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం

ఒకరు మృతి
బీరుట్‌ : ఇజ్రాయిల్‌ దళాలు మరోసారి లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. ఆదివారం బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ జెట్‌లు బాంబుల వర్షం కురిపించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ చేసిన మూడవ దాడి ఇది. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌ ప్రాంత గ్రామమైన హల్టాలో జరిగిన డ్రోన్‌ దాడిలో ఒక వ్యక్తి మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, హిజ్బుల్లా సభ్యుడు లక్ష్యంగా తాము దాడులు జరిపామని, ఆ వ్యక్తి మరణించాడని ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. బాంబుల వర్షంతో ఆ ప్రాంతమంతటా భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. రెండు భవనాల మధ్య ఉన్న లోహపు గుడారం వంటి నిర్మాణంపై మూడు బాంబులు పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పూర్తిగా దగ్ధమైన రెండు ట్రక్కుల ఫోటోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. కాగా జరిగిన ధన, ప్రాణనష్టంపై ఇంకా సమాచారం తెలియాల్సి వుంది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకి చెందిన క్షిపణుల నిల్వలపై దాడులు చేసిసనట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. అలా ఆయుధాలను నిల్వ చేయడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. దాడికి గంట ముందు ఇజ్రాయిల్‌ హెచ్చరికలు చేస్తూ, హదత్‌ ప్రాంతంలోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజలు దూరంగా తరలిపోవాలని హెచ్చరించింది. బీరుట్‌పై దాడికి ముందు కొన్ని ప్రాంతాల్లో యుద్ధవిమానాల సైరన్‌లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాల్లోకి కాల్పులు కూడా జరిగాయన్నారు. పలు కుటుంబాలు ప్రాణ భయంతో పరుగులు తీశాయన్నారు.ఈ దాడులను లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌ ఖండించారు. కాల్పుల విరమణకు హామీ ఇచ్చిన అమెరికా, ఫ్రాన్స్‌లు దీనిపై సమాధానమివ్వాలని అన్నారు. దాడులను నిలిపివేయాల్సిందిగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకునే వారిలో ఈ దాడి భయాందోళనలు సృష్టించిందని యుఎన్‌ సమన్వయకర్త జీనిన్‌ హెన్నిస్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో గతేడాది నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలపై ఆదివారం జరిగిన దాడి మూడవదని లెబనాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దాడి మార్చి 28న జరగగా, రెండవ దాడి ఏప్రిల్‌ 1న జరిగింది. ఏప్రిల్‌ 1న జరిగిన అప్రకటిత దాడిలో హిజ్బుల్లా అధికారి సహా నలుగురు మరణించినట్లు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 190 మంది మరణించారని, 485 మంది గాయపడ్డారని లెబనాన్‌ ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img