నవతెలంగాణ-హైదరాబాద్ : టెహ్రాన్‌లోని ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. రాజధానిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) విరుచుకుపడ్డాయి. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలను లక్ష్యంగా చేసుకున్నారు. కచ్చితమైన సమాచారంతో సుమారు 100 ఫైటర్ జెట్‌లను ఉపయోగించి 250కి పైగా బాంబులను జారవిడిచినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
ఇరాన్ రాజకీయ, సైనిక నిర్ణయాలు తీసుకునే కీలక కేంద్రంగా ఈ సముదాయం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, ఇజ్రాయెల్‌పై వ్యూహాలను ఇక్కడే రచిస్తారని, అందుకే ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక్కడి నుంచే ఇరాన్ సైనిక, భద్రతా వ్యవహారాలన్నీ నడుస్తాయని, ఇది ఉగ్రవాద పాలనకు ప్రధాన కార్యాలయంగా మారిందని ఐడీఎఫ్ పేర్కొంది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు ముమ్మరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా, కువైట్‌లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో అక్కడ పాక్షికంగా ఆస్తి నష్టం వాటిల్లింది. అటు ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు ఐఏఈఏ నిర్ధారించింది.
మరోవైపు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌పై దీర్ఘకాలిక ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి.



