నవతెలంగాణ-హైదరాబాద్: లెబనాన్‌లోని ఐరాస సభ్యులపై ఇజ్రాయిల్ గ్రెనేడ్ల దాడి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘గత నవంబర్‌లో యుద్ధ ఒప్పందం ముగిసిన తర్వాత యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్ సిబ్బంది మరియు ఆస్తులపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటి’’ అని యుఎన్ తాత్కాలిక దళం (యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్ ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మంగళవారం ఉదయం తమ శిబిరానికి వెళ్లేందుకు రహదారిపై అడ్డంకులను తొలగించేందుకు యత్నిస్తున్న యుఎన్‌శాంతి పరిరక్షకులపై ఇజ్రాయిల్ డ్రోన్లు నాలుగు గ్రెనేడ్లను జారవిడిచాయని లెబనాన్‌లోని యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్ తెలిపింది. ఒక గ్రెనేడ్ యుఎన్ సిబ్బంది, వాహనాలకు 20మీటర్ల దూరంలో పడగా, మరో మూడు 100 మీటర్ల దూరంలో పడినట్లు పేర్కొంది. మార్వాహిన్ గ్రామానికి ఆగేయంగా ఉన్న ఈ ప్రాంతంలో రహదారి క్లియరెన్స్ గురించి యుఎన్‌ఎఫ్‌ఐఎల్ ముందుగానే ఇజ్రాయిల్ సైన్యానికి సమాచారం అందించారని వెల్లడించింది.
గతవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లెబనాన్‌లో శాంతి పరిరక్షక కమిషన్‌ను 2026 చివరివరకు ఏకగ్రీవంగా పొడిగించింది. ఆ తర్వాత ఏడాది పొడవునా క్రమబద్ధంగా మరియు సురక్షితంగా సభ్యుల కుదింపు మరియు ఉపసంహరణ ప్రారంభమవుతుందని తెలిపింది.