నవతెలంగాణ న్యూఢిల్లీ: ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్‌లో లిట్టి చోఖా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారినపడ్డారు. దీంతో కొంత మంది విద్యార్థులకు క్యాంపస్‌లో చికిత్స అందించగా, మరికొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు మండిపడ్డారు. ఫుడ్ కోసం డబ్బులు చెల్లించి కలుషిత ఆహారం తింటున్నామని కొందరు స్టూడెంట్స్ ఆరోపించారు. హాస్టల్ మొత్తం రాత్రంతా రోగుల వార్డుగా మారిపోయిందని విమర్శించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై సోషల్ మీడియా పోస్ట్‌లో మండిపడ్డారు.
కాగా, ఐఐటీ ఢిల్లీ సంస్థ ఈ ఆరోపణలను ఖండించింది. బాయిస్ హాస్టల్‌లోని విద్యార్థులు బయట వ్యక్తి అమ్మిన స్వీట్లు తిన్నారని, దీని వల్ల వారికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఏప్రిల్ 30న జరుగాల్సిన పరీక్షను మే 8కి వాయిదా వేసినట్లు పేర్కొంది. మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించింది.
ఐఐటీ ఢిల్లీలో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థులకు అస్వస్థత
- Advertisement -
RELATED ARTICLES