– కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ తీరు
– భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత, వాతావరణ పరిస్థితుల ఎఫెక్ట్
రాయ్‌పూర్: మావోయిస్టులను అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కారు ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. ఇందుకు మార్చి 31, 2026ను డెడ్‌లైన్‌గా నిర్దేశించుకున్నది. ఇందులో భాగంగా మావోయిస్టులకు కంచుకోట, కీలక ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్‌ను జరిపింది. ఈ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని అధికారులు చెప్తున్నారు.
గతనెల 21న ప్రారంభమైన ఈ ఆపరేషన్ దాదాపు మూడు వారాల పాటు కొనసాగింది. అయితే, భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలకు కొన్ని ఎదురుదెబ్బలు తాకటం, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం వంటి కారణాలతో ఆ తర్వాత ఆపరేషన్ ఆగిపోయింది. తుపాకులు, బాంబుల మోతలు, హెలికాప్టర్లు, డ్రోన్ల సంచారం, కాల్పుల శబ్దాలతో మూడు వారాలపాటు అక్కడి అడవులు హోరెత్తాయి. అయితే, భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పారామిలిటరీ బలగాలను కేంద్రం వెనక్కి పిలవటంతో ఒక్కసారిగా ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడింది. దీంతో అడవులలో నిశబ్దం అలుముకున్నది. కాగా కేంద్రం చేపట్టిన ఈ ఆపరేషన్‌పై పలు పార్టీలు, మానవ హక్కుల సంఘాలు, నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి ప్రకారం.. కర్రెగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మడ్వితో పాటు టాప్ మావోయిస్టు లీడర్లు ఉన్నారన్న సమాచారం పలు ఏజెన్సీల నుంచి అందింది. దీంతో గతనెల 21న ఆపరేషన్‌ను ప్రారంభించారు. 25 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది, భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన హెలికాప్టర్లు, డ్రోన్లు రంగంలోకి దిగాయి. ”వ్యూహాన్ని రూపొందించటం కోసం సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ పోలీసులు సమావేశాన్ని జరిపారు. సీనియర్ ఎంహెచ్‌ఏ అధికారులు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు. ఆపరేషన్ నిర్వహణ కోసం దళాలకు దాదాపు 15 రోజుల సమయాన్ని ఇచ్చారు” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ ఆపరేషన్ సందర్భంగా తెలంగాణలో మందుపాతర పేలి గ్రేహౌండ్స్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు మరణించారు. వేర్వేరు పేలుళ్లలో ఇద్దరు భద్రతా సిబ్బంది తమ అవయవాలను కోల్పోయారు. దాదాపు అరడజను మంది గాయపడ్డారు. ”హిడ్మాతో పాటు మావోయిస్టు సీనియర్ నాయకులు తప్పించుకోగలిగారు. తొలుత, ఈ ఆపరేషన్ కోసం ఒక ప్రణాళిక రూపొందించాం. కానీ, అది కేంద్ర బలగాలకు కఠినమైన ప్రాంతం కావడంతో ఇలాంటి వాతావరణ పరిస్థితిలో భద్రతా సిబ్బంది అక్కడ వేచి ఉండటం సురక్షితం కాదు కాబట్టి.. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్‌ను ముగించాలని మేం నిర్ణయించాం” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పీపుల్స్ లిబరేషన్ ఘెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బలీయమైన బెటాలియన్ నెంబర్.1 రక్షణలో ఉన్న మావోయిస్టు కీలక నేతలను ఏరివేయటం ఈ ఆపరేషన్ లక్ష్యం. 20 మంది మావోయిస్టులను గుర్తించామనీ, 11 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్టు సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. కాగా, చనిపోయినవారిలో 16 ఏండ్ల బాలుడు, పలువురు మహిళలు ఉన్నారని తెలిసింది.
మూడు వారాలు సాగి.. ఆ తర్వాత ఆగి..
- Advertisement -
- Advertisement -