Friday, May 16, 2025
Homeరాష్ట్రీయంఅన్నదాతలు గాలికొదిలేయడం దారుణం

అన్నదాతలు గాలికొదిలేయడం దారుణం

- Advertisement -

– మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను గాలికొదిలేసి అందాల పోటీల వెంట పడుతున్నదని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్‌ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో చాలా చోట్ల నెలల కొద్దీ, వారాల కొద్దీ ధాన్యం కుప్పలు పోసి రైతులు ఎదురుచూస్తున్నారనీ, ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రైతులు కష్టపడి పండించిన పంటలను వెంటనే కొనాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడదన్నారు. కనీస మద్దతు ధర, మండీ హమాలీ చార్జీలు, ట్రాన్స్‌ పోర్టేషన్‌, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్‌ యార్డులు, గోడౌన్ల చార్జీలు, అధికారుల చార్జీలు, వడ్ల బస్తాలు, గన్నీ బ్యాగులు వంటి ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం వహిస్తుందని చెప్పారు. రైతులకు బోనస్‌ బోగస్‌ అయిందనీ, రైతు భరోసా లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల పంటను కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు.
ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌లో ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేసిందని కొనియాడారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, చైనా తర్వాత ప్రధాన డిఫెన్స్‌ ఎక్స్‌పోర్టర్‌లో మన దేశం ఉందని చెప్పారు. చాణక్యనీతితో పాక్‌తో యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారని చెప్పారు. 17నుంచి తలపెట్టిన తిరంగా ర్యాలీను జయప్రదం చేయాలని కోరారు. మోసపూరిత ప్రభుత్వం విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ వస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి సర్కార్‌ విఫలమైందన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన డీఏలు, జీపీఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అడిగితే ఉద్యోగులను బ్లాక్‌మెయిల్‌ చేయడం దారుణమని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -