నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తన తండ్రికి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.
ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్, తన తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ కూడా పాలుపంచుకున్నారు. ప్రార్థనల అనంతరం జగన్ తన తల్లిని ఆప్యాయంగా పలకరించగా, ఆమె కుమారుడిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమానికి వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దివంగత నేతకు నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా వారు ఆయన సేవలను స్మరించుకున్నారు.