నవతెలంగాణ – హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వివరాల్లోకి వెళితే… వినాయకన్ ప్రస్తుతం ‘ఆడు 3’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తొడుపుజ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన భుజం, మెడ భాగంలోని నరాలు, కండరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఆయనకు కనీసం ఆరు వారాల పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు.



