బీహార్ 8 మంది మృతి
పాట్నా: బాణసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్టు సమాచారం. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు బాణసంచా ఉన్న ఇల్లు పూర్తిగా దెబ్బతింది. మరోవైపు, ప్రమాదస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బీహార్‌లోని సివాన్ జిల్లా, బర్హరియా బ్లాక్‌లోని అలంపుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
బాణసంచా తయారు చేస్తున్న మహమ్మద్ ఆలంఘీర్ మియాన్ ఇంట్లో తొలుత భారీ అగ్నిప్రమాదం జరిగింది. అది కాస్త పెద్ద ఎత్తున పేలుళ్లకు దారితీసింది. అయితే, ప్రమాద సమయంలో ఇంట్లో పెద్దఎత్తున బాణసంచాను నిల్వ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ఆలంఘీర్ మియాన్ కూడా ఉన్నారు. బాధితుల్లో ఎక్కువమంది ఆయన కుటుంబ సభ్యులేనని సమాచారం. దాదాపు రెండు గంటల పాటు అడపాదడపాగా పేలుళ్లు కొనసాగాయి. పేలుడు తీవ్రతకు ఇంటి ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, శిథిలాలు రోడ్డుపై చాలా దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్ర భయాందోళనకు గురైన సమీప ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.






కామెంట్లు (0)