సీఈసీ రాజీనామా, సర్ రద్దు చేయాలి
ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి :
ఐదు విద్యార్థి సంఘాల సంయుక్త పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయటంతో పాటు ఆయనపై కేంద్రం చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) రద్దు చేయాలి.., ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న జంతర్‌మంతర్ భారీ ఆందోళన చేపట్టనున్నట్టు ఐదు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. మంగళవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్ఏ, పీఎస్‌యూ, ఏఐఎస్‌బీ నేతలు సమావేశం జరిగింది. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య, ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజన్, ఏఐఎస్ఏ ప్రధాన కార్యదర్శి ప్రసీంజీత్ కుమార్, పీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి బాలరామ్ సజీవ్, ఎఐఎస్‌బీ అఖిల భారత కన్వీనర్ అమిత్ సింగ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. జ్ఞానేశ్ కుమార్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలు, రాజకీయ అనుబంధాలకు అతీతంగా ప్రజలు ఒక్కతాటిపైకి వస్తున్నారని పేర్కొన్నారు.శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వ యంత్రాంగం అణచివేతకు పాల్పడుతోందని విద్యార్థి సంఘాలు విమర్శించారు. నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడం, వారిని ఈడ్చుకెళ్లడం, దాడులకు పాల్పడటం వంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మహిళా నిరసనకారుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు విస్తృత ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు పేర్కొన్నారు. ఐదు విద్యార్థి సంఘాలు ఐక్యంగా అక్టోబర్ 10న జంతర్‌మంతర్‌కు మార్చ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఆందోళనలో భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇదే డిమాండ్లపై ఆందోళనలకు సిద్ధమవుతున్న వివిధ ప్రజాస్వామిక సంస్థలతో కలిసి ఉద్యమాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. రాజ్యాంగ విలువలను విశ్వసించే ప్రజాస్వామిక శక్తులు, వ్యక్తులంతా ఈ ఆందోళనలో పాల్గొని నిరసన గళాన్ని మరింత బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
10న జంతర్‌మంతర్ వద్ద ఆందోళన
54 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)