మోడీ సర్కారు అస్పష్టతతో అనుమతుల జాప్యం
మస్క్ మాటల్లో గ్రామీణ ఇంటర్నెట్.. ఆచరణలో ఖరీదైన సేవలు
విదేశీ సంస్థల చేతుల్లోనే ఉపగ్రహ నెట్‌వర్క్ నియంత్రణ
భద్రతపై ప్రశ్నలకు సమాధానాలేవీ?
డిజిటల్ భారత్ అంటూ ప్రచారం చేస్తున్న మోడీ సర్కారు.. మరోవైపు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోందా? స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఇచ్చి, భద్రతా అనుమతుల విషయంలో నెలల తరబడి తుది నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచడం కేంద్రం విధానపరమైన అస్పష్టతను బయటపెడుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సేవలు విస్తరించాలనుకుంటున్న ఎలన్ మస్క్.. భారత గ్రామాలకు ఇంటర్నెట్ అందిస్తామంటూ ప్రచారం చేస్తున్నా, ధరలు, భద్రత, దేశ సార్వభౌమాధికారంపై కీలక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు.
న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ కనెక్టివిటీని విస్తరిస్తామని చెప్తున్నకేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. స్టార్‌లింక్ ప్రవేశంపై మాత్రం స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించలేకపోతోంది. గతేడాది జూన్‌లోనే లైసెన్స్ పొందిన ఈ సంస్థకు ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికీ వాణిజ్య సేవలు ప్రారంభించే అవకాశం రాలేదు. భద్రతా కారణాలతో అనుమతులు నిలిపివేసినట్టు వార్తలు వస్తున్నా.. అసలు అభ్యంతరాలేమిటో, నిర్ణయం ఎప్పటికి వెలువడుతుందో కేంద్రం వెల్లడించడం లేదు. అలాగే.. భారత మార్కెట్‌లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న మస్క్ కూడా గ్రామీణ ప్రజలకు అందుబాటు ధరల్లో సేవలు అందిస్తామన్న నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ఉపగ్రహాల నియంత్రణ విదేశాల్లో!
స్టార్‌లింక్ వ్యవస్థలో వేలాది ఉపగ్రహాలు, వినియోగదారుల ఇండ్లపై ఏర్పాటు చేసే డిష్‌లు, సమాచారాన్ని ఇంటర్నెట్‌కు అనుసంధానించే భూస్థావరాలు, నెట్‌వర్క్‌ను నడిపించే సాఫ్ట్‌వేర్ కీలకం. ఏ ప్రాంతానికి సేవలు అందించాలి, ఏ డిష్‌ను పనిచేయనివ్వాలి, సమాచారాన్ని ఏ మార్గంలో పంపాలన్నది ఈ సాఫ్ట్‌వేర్ నిర్ణయిస్తుంది. కొత్త ఉపగ్రహాలు లేజర్ లింక్‌ల ద్వారా పరస్పరం సమాచారాన్ని పంపుకోగలవు. దీంతో భారత్‌లో ప్రారంభమైన సమాచారం మరో దేశంలోని భూస్థావరం ద్వారా ఇంటర్నెట్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఇదే భారత భద్రతకు సంబంధించిన ప్రధాన సమస్య. దేశంలో లైసెన్స్ ఉన్నంత మాత్రాన అంతరిక్షంలోని ఉపగ్రహాలను, వాటిని నియంత్రించే సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం పూర్తిగా అదుపు చేయలేదు. అమెరికా అనుమతితో 2022లో ఇరాన్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కావడం ఈ పరిమితిని స్పష్టం చేసింది. అక్కడి ప్రభుత్వ అనుమతి లేకుండానే డిష్‌లు పనిచేశాయి. అంటే, ఒక విదేశీ సంస్థ తలచుకుంటే దేశ సరిహద్దులకతీతంగా సేవలను ప్రారంభించగలదు. ఈ పరిస్థితిలో జాతీయ భద్రతకు సంబంధించిన హామీలు ఎంతవరకు అమలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు చెప్తున్నారు.
నిబంధనలున్నా.. స్పష్టత లేదు
భారత్‌లో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు లైసెన్స్ ఒక్కటే సరిపోదు. భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు సహా ఇతర అనుమతులు అవసరం. కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం భారత వినియోగదారుల సమాచారాన్ని దేశీయ భూస్థావరాల ద్వారానే పంపాలి. నిషేధిత వెబ్‌సైట్లను నిలిపివేయాలి. సరిహద్దులు, తీర ప్రాంతాల వెంబడి 50 కిలోమీటర్ల పర్యవేక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లే డిష్‌లను నిలిపివేయాలి. నెట్‌వర్క్ నిర్వహణ కేంద్రాలు భారత్‌లోనే ఉండాలి. ఈ నిబంధనలు అవసరమే. అయితే, వీటిని అమలు చేస్తున్నారో లేదో భారత్ తనిఖీలు, ఆడిట్‌ల ద్వారా మాత్రమే నిర్ధారించగలదని నిపుణులు చెప్తున్నారు. ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని ఎలా మళ్లిస్తున్నారన్నదానిపై పూర్తి నియంత్రణ ఉంటుందని చెప్పలేమనీ, మణిపూర్‌లో తిరుగుబాటుదారుల వద్ద, అండమాన్ సముద్ర ప్రాంతంలో మాదకద్రవ్యాల స్మగ్లర్ల వద్ద స్టార్‌లింక్ డిష్‌లు లభించడం కూడా అనధికార వినియోగంపై ఆందోళనలను పెంచిందని అంటున్నారు.
మస్క్ ప్రచారానికి.. వాస్తవాలకు మధ్య అంతరం
ప్రపంచవ్యాప్తంగా 165కు పైగా దేశాల్లో లైసెన్సులు ఉన్న స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతి ఎందుకు రావడం లేదని ఎలాన్ మస్క్ ప్రశ్నించారు. అయితే, భారత్‌లో స్టార్‌లింక్‌కు ఇప్పటికే లైసెన్స్ ఉంది. భద్రతా అనుమతులు, తుది స్పెక్ట్రమ్ కేటాయింపు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర దేశాల్లో అనుమతులు పొందినంత మాత్రాన భారత నిబంధనలను పాటించాల్సిన బాధ్యత నుంచి మస్క్ సంస్థకు మినహాయింపు లభించదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2021లో లైసెన్స్ లేకుండానే భారత్‌లో ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించిన స్టార్‌లింక్‌ను కేంద్రం నిలిపివేయించి, డిపాజిట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడు కూడా సంస్థ చెప్తున్న భద్రతా హామీలను స్వతంత్రంగా పరిశీలించాల్సిందేనని అంటున్నారు. భారత డేటా దేశంలోనే ఉంటుందని చెప్పడం ఒక అంశమైతే, దేశంలో సేవలను ఎప్పుడు నిలిపివేయాలి, ఎక్కడికి సమాచారాన్ని మళ్లించాలి అన్న నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంటుందన్నది మరో కీలక అంశమని నిపుణులు చెప్తున్నారు.
దేశానికి సొంత నెట్‌వర్క్ అవసరం
మస్క్ ఒత్తిడికి తలొగ్గి భద్రతా సమీక్షను హడావుడిగా ముగించాల్సిన అవసరం లేదని మేధావులు సూచిస్తున్నారు. అదే సమయంలో, స్పష్టమైన గడువు లేకుండా నిర్ణయాన్ని వాయిదా వేయడమూ సమర్థనీయం కాదనీ, స్టార్‌లింక్‌తోపాటు ఇతర సంస్థలు పాటించాల్సిన ప్రమాణాలు, నిర్ణయాల గడువును కేంద్రం ప్రకటించాలని అంటున్నారు. సమాచార ప్రవాహంపై స్వతంత్ర ఆడిట్‌లు, సేవల్లో మార్పులకు ముందస్తు సమాచారం, నిబంధనల ఉల్లంఘనకు కఠినమైన జరిమానాలు ఉండాలని సూచిస్తున్నారు. గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మత్స్యకారులు, విపత్తు సహాయక బృందాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ అందించాలనీ, అయితే, సైన్యం, కీలక మౌలిక సదుపాయాల కోసం ఒకే విదేశీ సంస్థపై ఆధారపడకూడదని వివరిస్తున్నారు. అంతిమంగా విదేశీ సంస్థలపై ఆధారపడకుండా భారత్ సొంత ఉపగ్రహ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోవడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచిస్తున్నారు. డిజిటల్ స్వావలంబన గురించి మాట్లాడే మోడీ సర్కారు ఈ దిశగా ఎంత ముందుకు వెళ్తుందన్నదే అసలు పరీక్షగా వారు చెప్తున్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మస్క్ భారత భద్రతా నిబంధనలకు లోబడి, ప్రజలకు అందుబాటు ధరల్లో సేవలు అందించగలరా అన్నదీ తేలాల్సి ఉంది. ఎందుకంటే ఉపగ్రహాలు ఆకాశంలో ఉన్నా, వాటిని నియంత్రించే సాఫ్ట్‌వేర్ విదేశీ సంస్థల చేతుల్లోనే ఉంటే.. దేశ డిజిటల్ భద్రతపై పూర్తి భరోసా సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భద్రత పేరుతో అనిశ్చితి
స్టార్‌లింక్‌తోపాటు జియో ఉపగ్రహ విభాగం, యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు కూడా భద్రతా అనుమతులు ఇంకా రాలేదని కేంద్రం చెప్తోంది. ఈనెల 8న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. కాబట్టి ఒక్క స్టార్‌లింక్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పలేమన్నది ప్రభుత్వ వాదన. అయితే, అందరికీ ఒకే నిబంధనలు విధించినంత మాత్రాన వాటి ప్రభావం ఒకేలా ఉండదు. ఉపగ్రహాల మధ్య సమాచార మార్పిడిని నిరోధించే నిబంధన స్టార్‌లింక్ సాంకేతికతపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు చెప్తున్నారు. భద్రతా సమీక్ష వివరాలను బహిరంగపరచలేకపోయినా, ఏ ప్రమాణాలను పరిశీలిస్తున్నారో, ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పడానికి అడ్డంకి ఏమిటి? దాదాపు నాలుగేండ్లుగా సాగుతున్న అనుమతుల ప్రక్రియపై స్పష్టత లేకపోవడం కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
గ్రామీణుల పేరుతో వ్యాపార విస్తరణ
ఈ ఏడాది మే నాటికి భారత్‌లో 11,256 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులో లేవని మస్క్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కానీ స్టార్‌లింక్ సేవలు సాధారణ మొబైల్ డేటాతో పోలిస్తే ఖరీదైనవి. భారత్‌లో అందుబాటు ధరలకు సేవలు అందిస్తామని మస్క్ చెప్తున్నప్పటికీ.. ధరలను ఇంకా ప్రకటించలేదు. కెన్యాలో నెలకు 10 డాలర్ల ధరకు సేవలు అందించిన ఉదాహరణ ఉన్నా.. భారత్‌లోనూ అదే ధరకు అందిస్తారని చెప్పలేం. కానీ గ్రామీణ ప్రజల అవసరాలను ప్రస్తావిస్తూ మార్కెట్‌లోకి రావడం ఒకటైతే, వారికి నిజంగా భరించగల ధరలకు సేవలు అందించడం మరొక అంశమని నిపుణులు ప్రస్తావిస్తున్నారు.





కామెంట్‌లు (0)