6.09 శాతానికి ద్రవ్యోల్బణం
ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువ
116 శాతానికి చేరిన ఉల్లి ధరల పెరుగుదల
8.94 శాతానికి ఆహార ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశంలో అమాంతం పెరిగిన ధరల మంట సామాన్యులపై భారాన్ని మరింత పెంచుతోంది. సెప్టెంబరులో 5.54 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ అక్టోబరులో 6.09 శాతానికి ఎగబాకింది. ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న గరిష్ట ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువ కావడం ఆందోళకరం. ఆహార ద్రవ్యోల్బణం కూడా 7.74 శాతం నుంచి 8.94 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉల్లి ధరల పెరుగుదల ఏకంగా 116.22 శాతంగా నమోదయ్యింది. వెల్లుల్లి ధరలు సైతం 60.74 శాతం పెరిగాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాలు ధరల ఒత్తిడి తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అధిక ధరలను కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ మరింత వడ్డీ రేట్లను పెంచొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే అర శాతం వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే.
గ్రామీణ ప్రాంతాల్లో మరింత భారం..
పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ధరల భారం అధికంగా ఉంది. అక్టోబరులో గ్రామీణ రిటైల్ ద్రవ్యోల్బణం 6.63 శాతానికి చేరగా, పట్టణ ప్రాంతాల్లో 5.41 శాతంగా చోటు చేసుకుంది. సెప్టెంబరులో ఇవి వరుసగా 6.08 శాతం, 4.88 శాతంగా ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 8.06 శాతం నుంచి 9.09 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 7.18 శాతం నుంచి 8.68 శాతానికి పెరిగింది. ఉల్లి, వెల్లుల్లి ధరల పెరుగుదల వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు బంగాళాదుంపల ధరలు 14.24 శాతం తగ్గాయి. వెండి ఆభరణాల ధరల పెరుగుదల సెప్టెంబరులోని 87.82 శాతం నుంచి 52.39 శాతానికి దిగివచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ తాకిడి..
రాష్ట్రాల వారీగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ధరల ఒత్తిడి అధికంగా నమోదయ్యింది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 8.05 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 6.68 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 7.81 శాతం, పట్టణాల్లో 6.37 శాతంగా నమోదయ్యాయి. కర్నాటక గ్రామీణ ద్రవ్యోల్బణం 7.54 శాతం, పట్టణ ద్రవ్యోల్బణం 6.60 శాతంగా ఉండగా, కేరళలో వరుసగా 7.01 శాతం, 5.58 శాతంగా నమోదైంది. ఇతర పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడులో గ్రామీణ, పట్టణ ద్రవ్యోల్బణం 7.86 శాతం, 6.84 శాతంగా ఉంది. మహారాష్ట్రలో 6.86 శాతం, 5.20 శాతంగా, ఉత్తరప్రదేశ్‌లో 7.20 శాతం, 4.88 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ధరల ఒత్తిడి కొనసాగుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పట్లో తగ్గకపోవచ్చు..
ద్రవ్యోల్బణం తక్షణమే తగ్గే అవకాశాలు కనిపించడం లేదని ఎలారా క్యాపిటల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ రీసెర్చ్, ఆర్థికవేత్త గరిమా కపూర్ అభిప్రాయపడ్డారు. గతంలో పెరిగిన ధరల ప్రభావం ఇంకా ఇతర రంగాలకూ విస్తరిస్తోందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి పరిస్థితులపై అంచనాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణం వెంటనే అదుపులోకి రాకపోవచ్చని తెలిపారు. రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో రిజర్వ్ బ్యాంక్ మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని ఎలారా క్యాపిటల్ అంచనా వేసింది.






కామెంట్‌లు (0)