Magazines

గిరి‘జనం’పై అప్రకటిత యుద్ధం

1 గంట క్రితం

tribal people
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

మధ్యప్రదేశ్ సర్కారుపై సీపీఐ(ఎం)
నేత బృందాకరత్ ఆగ్రహం
పోలీసుల తీరుపైనా మండిపాటు


పన్నా : మధ్యప్రదేశ్‌లోని పన్నాలో గిరిజనులు చేపట్టిన ఆందోళన రాజకీయంగా కీలక మలుపు తీసుకుంది. సీపీఐ(ఎం) నాయకురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు బృందా కరత్ ఈ పోరాటంలో భాగస్వా ములయ్యారు. ఆ ప్రాంతానికి చేరుకున్న ఆమె రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాలోని గిరిజన జనాభాపై "అప్రకటిత యుద్ధం" చేస్తోందని ఆరోపించారు. "ఇది కేవలం గిరిజనుల హక్కు లకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, కీలకమైన రాజ్యాంగ సమస్య" అని పేర్కొన్నారు. కెన్-బెత్వా ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వారిని పలకరించేందుకు పన్నాకు వచ్చిన ఆమె.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనలో భాగంగా, అజయ్‌గఢ్ ప్రాంతంలో జరుగుతున్న రుంజ్, మజ్గాయ్ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన గిరిజనులను కలిసి, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లా అజయ్‌గఢ్ ప్రాంతంలోని మజ్గాయ్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 'బహ్నన్రి తపారియన్' గ్రామంలో 40 రోజులుగా కొనసాగుతున్న నిరసన ఆదివారంతో ముగిసింది. 'జై కిసాన్ సంఘటన్' నాయకుడు అమిత్ భట్నాగర్ గత 25 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షను ప్రతిపక్ష నాయకుడు ఉమంగ్ సింఘార్ కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న దివ్య అహిర్వార్‌ను పోలీసులు నిరసన స్థలం నుంచే అరెస్టు చేశారు. ఆమెపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

'ప్రభుత్వం అనుసరిస్తున్న పిరికిపంద చర్య'

''బాధితురాలైన ఒక తల్లి నాకు చెప్పిన దాని ప్రకారం, పోలీసులు అర్ధరాత్రి వేళ 17 ఏండ్ల కుమార్తెను బలవంతంగా నిద్రలేపి, గ్రామం అంతటా తిప్పారు. ఇతరులను గుర్తించే నెపంతో పోలీసులు ఇలా చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే. పురుష పోలీసులు మహిళలను తాకడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించడం, లాఠీలతో కొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎంత పిరికిదంటే, దివ్యపై అబద్ధపు కేసులు బనాయించి జైలుకు పంపింది" అని బృందా కరత్ చెప్పుకొచ్చారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు భోపాల్‌లోని పార్టీ నాయకులు, అధికారులతో చర్చిస్తానని బృందా కరత్ తెలిపారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా బాధితులకు చట్టపరమైన సహాయం అందించే మార్గాలను అన్వేషిస్తామని, అలాగే ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయిలో కూడా లేవనెత్తుతామని ఆమె స్పష్టం చేశారు. 'జై కిసాన్ సంఘటన్' నాయకుడైన అమిత్ భట్నాగర్ మాట్లాడుతూ, "ఈ ఉద్యమం స్థానిక సమస్య స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి విస్తరిస్తోంది. దీని గళం ఇకపై భోపాల్, ఢిల్లీల్లోనూ వినిపిస్తుంది. ఇక్కడి గిరిజన ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు బలవంతంగా తొలగించడమే కాకుండా, వారిపై సెక్షన్ 307 (హత్యా ప్రయత్నం) కింద అవాస్తవమైన అభియోగాలను మోపారు" అని తెలిపారు. అనంతరం జైలుకు వెళ్లి దివ్యను బృందాకరత్ పరామర్శించారు.


పోలీసులపై తీవ్ర ఆరోపణలు

గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని బృందా విమర్శించారు. ఏదైనా ప్రాజెక్టును ప్రారంభించే ఆరు నెలల ముందే పూర్తి పరిహారం చెల్లించాలని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటోందని, అయితే ఆ ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టుకు ఎటువంటి పరిహారం అందకముందే ప్రజలను నిర్వాసితులను చేశారన్నారు. వారి ఇండ్లు, గ్రామాలు నీట మునిగిపోయాయని ఆమె తెలిపారు. రాత్రిపూట ఇండ్లలోకి బలవంతంగా ప్రవేశించి ప్రజలను వేధిస్తున్నారని పన్నా పోలీసులను తీవ్రంగా విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్