Magazines

అమెరికా విద్యపై విముఖత!

1 గంట క్రితం

Aversion towards education in America!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

భారతీయుల ప్రవేశాలు 
6.5 శాతం తగ్గుదల..

పిజి కోర్సుల్లో ఏకంగా 34 శాతం పతనం

వీసా అడ్డంకులు!

ఆర్థికంగా యుఎస్‌‌కు నష్టం

న్యూఢిల్లీ : అమెరికా చదువులపై భారత విద్యార్థుల మోజు తగ్గుతోంది. వీసా నిబంధనల కఠినతరం, ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి, పడిపోతున్న రూపాయి విలువ భారత విద్యార్థుల ఆసక్తిని దెబ్బతీస్తున్నాయి. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) విడుదల చేసిన ‘ఓపెన్‌ డోర్స్‌’ నివేదిక ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు 6.5 శాతం తగ్గి 3,39,435కు పరిమితమయ్యాయి. ముఖ్యంగా పిజి కోర్సుల్లో ప్రవేశాలు ఏకంగా 34 శాతం పడిపోయి 1,16,609కు చేరాయి. మరోవైపు అమెరికాలో కొత్తగా ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 17.7 శాతం పడిపోయింది. అయితే చదువు పూర్తయ్యాక పని అనుభవం పొందేందుకు వీలు కల్పించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఒపిటి)లో భారతీయుల భాగస్వామ్యం మాత్రం 27 శాతం పెరిగి 1,82,201కు చేరింది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా నిబంధనల కఠినతరం చేయడం, ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి నెలకొనడం, రూపాయి రికార్డ్‌ ‌పతనంతో పెరుగుతున్న విద్యా ఖర్చులు అమెరికా ఉన్నత విద్యపై భారత విద్యార్థుల ఆసక్తిని దెబ్బతీస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఐఐకి ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికా వర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 3,63,019గా ఉండగా, 2025-26లో 3,39,435కు తగ్గింది. పిజి కోర్సుల్లో ప్రవేశాలు 1,77,892 నుంచి 1,16,609కు పడిపోయాయి. అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో మాత్రం ఒక శాతం తగ్గి 39,711గా నమోదయ్యాయి. అయినప్పటికీ అమెరికాలో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌ 29.6 శాతం వాటాతో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య కూడా 4.3 శాతం తగ్గి 2,54,458కు చేరింది. కొత్తగా అమెరికాకు వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు మాత్రం తగ్గుతున్నాయి. భవిష్యత్తులో ఒపిటి అవకాశాలపై ఆంక్షలు విధించవచ్చన్న ప్రతిపాదనలు కూడా ఆందోళన పెంచుతున్నాయి.

ఇతర దేశాలపై 60 శాతం మంది ఆసక్తి..

అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు స్థూలంగా తగ్గుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2.7 శాతం తగ్గి 11,46,163కు చేరింది. కొత్తగా మొదటిసారి ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 17.7 శాతం పడిపోయి 2,28,123కు పరిమితమైంది. పిజి కోర్సుల్లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు 13.4 శాతం తగ్గి 4,23,078కు చేరగా, అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలు 0.3 శాతం తగ్గి 3,56,165గా నమోదయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేయడం, విద్యార్థి వీసాలపై అధిక పరిశీలన, ప్రయాణ ఆంక్షలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని విద్యా రంగ సంస్థలు పేర్కొంటున్నాయి. ఐఐఇ సర్వేలో పాల్గొన్న విద్యాసంస్థల్లో 88 శాతం వీసా దరఖాస్తు ప్రక్రియను, 70 శాతం ప్రయాణ ఆంక్షలను ప్రవేశాల తగ్గుదలకు కారణాలుగా పేర్కొన్నాయి. సుమారు 60 శాతం సంస్థలు విద్యార్థులు ఇతర దేశాలను ఎంచుకుంటున్నారని.. 45 శాతం అమెరికాలో చదువు ఖర్చు అధికంగా ఉండటాన్ని కారణంగా చూపాయి. ఒపిటి అవకాశాలను పరిమితం చేస్తే విదేశీ విద్యార్థులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతారని 95 శాతం విద్యాసంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

యుఎస్‌‌కే నష్టం..

అంతర్జాతీయ విద్యార్థుల తగ్గుదల అమెరికా విశ్వవిద్యాలయాలకే కాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూ నష్టం కలిగిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు 39.9 బిలియన్‌ డాలర్ల మేర తోడ్పడ్డారు. విదేశీ విద్యార్థులతో 3,09,409 ఉద్యోగాలకు మద్దతుగా నిలిచారని నాఫ్సా, జెబి ఇంటర్నేషనల్‌ విశ్లేషణ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక కార్యకలాపాలు ఏడు శాతం లేదా మూడు బిలియన్‌ డాలర్లు తగ్గాయి. 46 వేలకు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని అంచనా. ఈ ఏడాది మరింత విదేశీ రాబడి తగ్గొచ్చని నాఫ్సా అంచనా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్